కాళ్లకల్ గ్రామంలో వ్యక్తి మృతి కేసులో నిందితుడు అరెస్ట్
కాళ్లకల్ గ్రామంలో వ్యక్తి మృతి కేసులో నిందితుడు అరెస్ట్
మనోహరాబాద్, జూన్ 16: మండలంలోని కాళ్లకల్ గ్రామానికి చెందిన గంగిడి నరసింహారెడ్డి (50) మృతి కేసులో నిందితుడు పూర్ణస్వామి (33)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని తూప్రాన్ సీఐ వెంకట్ రాజా గౌడ్ తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరి 17న రాత్రి కాళ్లకల్ గ్రామంలోని ఓ కల్లు దుకాణం వద్ద నరసింహారెడ్డి తన మామ వరగంటి రాములను దూషిస్తున్న విషయంపై పూర్ణస్వామితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో పూర్ణస్వామి నరసింహారెడ్డిని రెండు చేతులతో బలంగా వెనక్కి నెట్టడంతో ఆయన కిందపడిపోయి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన నరసింహారెడ్డికి పలు ఆసుపత్రుల్లో చికిత్స అందించినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. చివరకు ఈ నెల 15న ఉదయం తన నివాసంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, జరిగిన ఘటనను అంగీకరించినట్లు వెల్లడించారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ వెంకట్ రాజా గౌడ్ మాట్లాడుతూ, చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని, సహనం పాటించాలని ప్రజలకు సూచించారు.

Post a Comment