వందేభారత్ రైలుకు తృటిలో ప్రమాదం.. గేదెను ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్
వందేభారత్ రైలుకు తృటిలో ప్రమాదం.. గేదెను ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్
శ్రీ సత్యసాయి జిల్లా, జూన్ 7: శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం రైల్వే స్టేషన్ సమీపంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కాచిగూడ నుంచి బెంగళూరు వెళ్తున్న వందేభారత్ రైలు రైల్వే ట్రాక్‌పైకి ఒక్కసారిగా వచ్చిన గేదెను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో రైలు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సమాచారం ప్రకారం, ట్రాక్‌పైకి వచ్చిన పశువును ఢీకొన్న ప్రభావంతో రైలు ఇంజిన్ ముందు భాగం దెబ్బతింది. దీంతో ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తి రైలు ముందుకు సాగలేని పరిస్థితి ఏర్పడింది. ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే సాంకేతిక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు.
ఇంజిన్ దెబ్బతినడంతో రైలును తిరిగి నడిపించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు రైలును అక్కడే నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో బెంగళూరు మార్గంలో రాకపోకలు సాగించే పలు రైళ్లపై ప్రభావం పడింది.
ప్రధాన మార్గంలో వందేభారత్ నిలిచిపోవడంతో వెనుక నుంచి వచ్చే కొన్ని రైళ్లను సమీప స్టేషన్లలో నిలిపివేశారు. ఫలితంగా ప్రయాణికులు ఆలస్యానికి గురై ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాక్‌పై పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి, రైళ్ల రాకపోకలను పునరుద్ధరించడానికి రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
రైల్వే అధికారులు ఘటనపై విచారణ చేపట్టగా, ట్రాక్‌లపై పశువులు సంచరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

Post a Comment