భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు శ్రీకారం
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు శ్రీకారం
భక్తులకు ఇబ్బందులు లేకుండా శాస్త్రోక్తంగా పనులు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఆలయ పునరుద్ధరణ పనులకు శనివారం శుభారంభం జరిగింది. భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావుతో కలిసి జిల్లా కలెక్టర్ అంకిత్ IAS వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ఆలయ పునరుద్ధరణ పనులు ఆగమ శాస్త్ర సంప్రదాయాలకు అనుగుణంగా, పూర్తి శాస్త్రోక్తంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆలయ పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా వేద పండితుల సూచనలు, మార్గదర్శకాల మేరకు ప్రతి నిర్మాణ దశను చేపట్టాలని సూచించారు.
పనుల సమయంలో ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. స్వామివారి దర్శనం, నిత్యపూజలు, అర్చనలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే క్యూ లైన్ల నిర్వహణ, తాగునీటి సౌకర్యం, పరిశుభ్రత, భద్రత వంటి అంశాల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రూ.540 కోట్ల వ్యయంతో భద్రాచలాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తొలి విడత నిధులతో ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభించామని, 2027 గోదావరి పుష్కరాల నాటికి అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, దేవస్థానం ఈవో దామోదరరావు, ఇరిగేషన్ ఈఈ జానీ, డిప్యూటీ తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ పూణేం కృష్ణ, గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాస్, వేద పండితులు, దేవస్థానం అధికారులు, ఇంజినీరింగ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment