జిల్లా న్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: జస్టిస్ జె. శ్రీనివాస్
జిల్లా న్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: జస్టిస్ జె. శ్రీనివాస్
హైదరాబాద్, జూన్ 12: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ వ్యవస్థ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై కొత్తగూడెం బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తెలంగాణ హైకోర్టు గౌరవ న్యాయమూర్తి, జిల్లా పోర్ట్‌ఫోలియో జడ్జి జస్టిస్ జె. శ్రీనివాస్‌ను హైదరాబాద్ హైకోర్టులో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో న్యాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి, రామవరం వద్ద నూతన కోర్టు భవనాల నిర్మాణం, న్యాయవాదులు మరియు వ్యాజ్యదారులకు అవసరమైన సౌకర్యాల కల్పన, అలాగే ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద నమోదయ్యే కేసుల విచారణ కోసం జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు.
జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు న్యాయ మౌలిక సదుపాయాలు, ప్రత్యేక కోర్టులు, ఆధునిక సౌకర్యాల ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రతినిధి బృందం కోరింది.
ఈ సందర్భంగా జస్టిస్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయవాదులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ మధుల్కర్, ప్రధాన కార్యదర్శి మహేష్ గడిపెల్లి, కార్యవర్గ సభ్యులు కే. సంజీవరావు, షాజహాన్ పర్వీన్, జి. నాగరాజు, బి. దేవదాస్, డి. ప్రసాద్, ఉమా, ఉషారాణి, బార్ అసోసియేషన్ సలహాదారు రమేష్ కుమార్ మక్కడ్, న్యాయవాదులు పప్పుల ప్రసాద్, కే. రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment