లోన్ యాప్ వేధింపులు భరించలేక యువకుడి ఆత్మహత్య
లోన్ యాప్ వేధింపులు భరించలేక యువకుడి ఆత్మహత్య
జగిత్యాల జిల్లా: లోన్ యాప్ వేధింపులు మరో యువ ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో విషాదాన్ని నింపింది. పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన అక్కినపల్లి లిఖిత్ (21) అనే యువకుడు లోన్ యాప్‌ల ద్వారా అప్పులు తీసుకున్నట్లు సమాచారం.
అప్పు వసూళ్ల పేరుతో లోన్ యాప్ నిర్వాహకులు తీవ్రంగా వేధించడంతో మానసికంగా కుంగిపోయిన లిఖిత్ కొద్ది రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆదివారం (జూన్ 1) లిఖిత్ మృతి చెందాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్ లోన్ యాప్‌ల ద్వారా జరిగిన అప్పులు, వసూళ్ల విధానం, ఇతర ఆర్థిక లావాదేవీలపై విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా యువకుడు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment