చర్ల విజయ కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ
చర్ల విజయ కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ
చర్ల, జూన్ 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని చిన్న ఇంద్రకీలాద్రిలో ఉన్న శ్రీ విజయ కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరు దుండగులు ఆలయ గ్రిల్స్‌ను పగలగొట్టి లోపలికి ప్రవేశించి హుండీని ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
ఈ ఘటన ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డైంది. దొంగలు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి హుండీని అపహరిస్తున్న దృశ్యాలు స్పష్టంగా నమోదైనట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం ఆలయ నిర్వాహకులు ఘటనను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు చర్ల ఎస్సై నర్సిరెడ్డి సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్‌లను స్వాధీనం చేసుకుని దొంగల గుర్తింపునకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవల పాత చర్ల ప్రాంతంలోని శివాలయంలో కూడా చోరీ యత్నం జరగడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. వరుసగా ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు పోలీసు అధికారులను కోరుతున్నారు.

Post a Comment