-->

ముషీరాబాద్‌లో కల్వకుంట్ల కవిత ఘాటు హెచ్చరికలు.. "మాతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు"

 

ముషీరాబాద్‌లో కల్వకుంట్ల కవిత ఘాటు హెచ్చరికలు.. "మాతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు"

ముషీరాబాద్‌లో కల్వకుంట్ల కవిత ఘాటు హెచ్చరికలు.. "మాతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు"

హైదరాబాద్‌లోని ముషీరాబాద్ డయారా మార్కెట్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

తమ పార్టీ జెండా పండుగ కోసం వేసిన పోస్టర్లను చించివేస్తున్నారని ఆరోపించిన కవిత, "మాతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు. దాదాగిరి, గుండాగిరి చేస్తే ఊరుకోం. మేము తిరగబడితే మీ జెండాలు కూడా కనబడవు" అంటూ హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో పోటీ పనితీరులో ఉండాలని, బెదిరింపులు, అడ్డంకులు సరికాదని అన్నారు.

తెలంగాణలో ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు ఉన్నప్పటికీ ప్రజలకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం కలగలేదని పేర్కొన్న కవిత, అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో కొత్త పార్టీ జెండాను రూపొందించి ప్రజల ముందుకు వచ్చామని తెలిపారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదని ఆమె విమర్శించారు. జీతాలు స్వల్పంగా పెరిగినా, నిత్యావసర వస్తువుల ధరలు, ముఖ్యంగా విద్యా, వైద్య ఖర్చులు భారీగా పెరిగాయని చెప్పారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో తమ పార్టీ "పంచజన్యం" పేరుతో ఐదు కీలక అంశాలను ప్రధాన ఎజెండాగా తీసుకుందని కవిత వెల్లడించారు. కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యాన్ని ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. అలాగే యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు అందించి స్వయం ఉపాధికి ప్రోత్సాహం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

రైతులను ఆర్థికంగా బలోపేతం చేసి "రైతును రాజును చేయడం", అన్ని కులాలు, మతాల వారికి సమాన అవకాశాలు కల్పించడం కూడా తమ పార్టీ లక్ష్యాలని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆరోపించిన కవిత, వారికి 250 గజాల స్థలం ఇస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఉద్యమకారుల హక్కుల కోసం జూలై 2న ఉప్పల్ భగాయత్‌లో భూపోరాటం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ముషీరాబాద్ నియోజకవర్గానికి పలుమార్లు ఎమ్మెల్యేలు ఎన్నికైనా, ఇప్పటికీ డ్రైనేజీ, తాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు అవకాశాలు ఇచ్చినా ప్రజలకు ఆశించిన అభివృద్ధి జరగలేదని అన్నారు.

"మీ ఆడబిడ్డ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మహిళా నాయకత్వం ఎలా ఉంటుందో చూపిస్తాం. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తాం" అని కవిత పిలుపునిచ్చారు.

రెండు నెలల క్రితమే ఏర్పడిన తమ పార్టీని చూసి పాత పార్టీలు భయపడుతున్నాయని వ్యాఖ్యానించిన ఆమె, ప్రజల సమస్యలపై పోటీ పడాలని, పోస్టర్లు చింపడం వంటి చర్యలు మానుకోవాలని సూచించారు.

రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో, అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి విజయం సాధిస్తుందని కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793