పీర్ల పండుగ నుంచి వస్తుండగా దారుణ హత్య.. జమ్మికుంటలో వ్యక్తి మృతి
పీర్ల పండుగ నుంచి వస్తుండగా దారుణ హత్య.. జమ్మికుంటలో వ్యక్తి మృతి
జమ్మికుంట, జూన్ 29: కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. అంకుశాపూర్ గ్రామానికి చెందిన పైతరి మొగిలి (తండ్రి సాయిలు) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు బలమైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
మృతుడి భార్య పైతరి శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు, మొగిలి సైకిల్‌పై మడిపల్లి గ్రామంలో జరుగుతున్న పీర్ల పండుగకు వెళ్లాడు. రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య ఇంటికి తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. మడిపల్లి గ్రామ శివారుకు చేరుకున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి తల, నుదురు, గడ్డం కింద భాగంలో బలమైన ఆయుధంతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తీవ్ర రక్తస్రావంతో మొగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఫిర్యాదులో మృతుడి భార్య శారద, మడిపల్లి గ్రామానికి చెందిన గంగారపు మహేష్ (తండ్రి ఐలయ్య)పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు మహేష్‌ను ప్రధాన అనుమానితుడిగా పరిగణించి విచారణ చేపట్టారు.
పీర్ల పండుగ సందర్భంగా జరిగిన ఈ హత్యతో అంకుశాపూర్, మడిపల్లి గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
గమనిక: ప్రస్తుతం ఇది మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసు మాత్రమే. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరూ నేరస్థులుగా నిర్ధారించబడలేదు.

Post a Comment