-->

ఆస్తి తీసుకుని కన్నవారినే గెంటేసిన కొడుకులు.. వృద్ధ దంపతులకు ఇంటిని తిరిగి అప్పగించిన అధికారులు

ఆస్తి తీసుకుని కన్నవారినే గెంటేసిన కొడుకులు.. వృద్ధ దంపతులకు ఇంటిని తిరిగి అప్పగించిన అధికారులు
ఆస్తి తీసుకుని కన్నవారినే గెంటేసిన కొడుకులు.. వృద్ధ దంపతులకు ఇంటిని తిరిగి అప్పగించిన అధికారులు

మిర్యాలగూడ, జూన్ 7: జీవితాంతం పిల్లల కోసమే కష్టపడి సంపాదించిన ఆస్తులను వారికి పంచిపెట్టిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేసిన ఘటనలో అధికారుల జోక్యంతో వృద్ధ దంపతులకు న్యాయం జరిగింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకున్న ఈ ఘటన వృద్ధుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది.

మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఇంజం చంద్రకళ, రమణారెడ్డి (70) దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలను ఎంతో ప్రేమగా పెంచి చదివించి, వివాహాలు కూడా జరిపించారు. అనంతరం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఇంజంవారిగూడెంలో ఉన్న తమ వ్యవసాయ భూమిని కుమారులకు పంచి ఇచ్చారు.

అంతేకాకుండా మిర్యాలగూడలో చంద్రకళ పేరిట ఉన్న ఇంటిలో చిన్న కుమారుడు నివాసం ఉంటున్నాడు. అయితే వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తల్లిదండ్రులను ఇంట్లోకి రానీయకుండా గత ఐదేళ్లుగా వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కుటుంబ పెద్దలు, బంధువులు పలుమార్లు పంచాయితీలు చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు.

దీంతో న్యాయం కోసం వృద్ధ దంపతులు అధికారులను ఆశ్రయించారు. తమ గోడును కన్నీటి పర్యంతమై వివరించారు. ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న అధికారులు "మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్-2007" ప్రకారం విచారణ చేపట్టారు.

విచారణలో భాగంగా కుమారుడు వెంకటరెడ్డిని కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని పలుమార్లు ఆదేశించినప్పటికీ స్పందించలేదని అధికారులు తెలిపారు. రెవెన్యూ, సంక్షేమ శాఖల విచారణలో తల్లిదండ్రుల నుంచి ఆస్తి పొందిన తర్వాత వారిని ఇంటి నుంచి వెళ్లగొట్టిన విషయం నిర్ధారణ కావడంతో జిల్లా అధికారులకు నివేదికలు సమర్పించారు.

చట్టంలోని నిబంధనల ప్రకారం తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత నిర్వర్తించని పిల్లలకు బదిలీ చేసిన ఆస్తిని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ నిబంధన ఆధారంగా అధికారులు చర్యలు చేపట్టారు.

వయోవృద్ధుల సంరక్షణ చట్టం-2007 ప్రకారం తల్లిదండ్రులకు ఇంటి హక్కును పునరుద్ధరించాలని జిల్లా అధికారులు గత నెల 23న మిర్యాలగూడ ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల అమలులో భాగంగా మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజారెడ్డి, సీఐ నాగభూషణం, రెవెన్యూ శాఖ, మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకుని వృద్ధ దంపతులకు ఇంటిని అప్పగించారు.

ఎన్నో రోజుల తర్వాత తమ సొంత గడపలోకి అడుగుపెట్టిన చంద్రకళ, రమణారెడ్డి దంపతులు ఆనందబాష్పాలతో అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఘటన ద్వారా ఆస్తి ఇచ్చిన తర్వాత పిల్లలు నిర్లక్ష్యం చేసినా వృద్ధ తల్లిదండ్రులు చట్టపరంగా న్యాయం పొందవచ్చని మరోసారి స్పష్టమైంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం కేవలం కుటుంబ సమస్య మాత్రమే కాకుండా చట్టరీత్యా శిక్షార్హమైన చర్య అని ఈ కేసు బలంగా చాటి చెప్పింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793