-->

ఓదెలలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ సమయస్ఫూర్తి.. మహిళ ప్రాణాలు కాపాడిన సిబ్బంది

 

ఓదెలలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ సమయస్ఫూర్తి.. మహిళ ప్రాణాలు కాపాడిన సిబ్బంది

ఓదెలలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ సమయస్ఫూర్తి.. మహిళ ప్రాణాలు కాపాడిన సిబ్బంది

పెద్దపల్లి జిల్లా ఓదెలలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ సమయస్ఫూర్తితో స్పందించి ఓ మహిళకు సకాలంలో వైద్యసాయం అందేలా చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వారి చొరవతో మహిళ సురక్షితంగా ఆసుపత్రికి చేరుకుని ప్రస్తుతం కోలుకుంటున్నారు.

మద్దికుంట గ్రామానికి చెందిన తాండ్ర నిరోషా (30) తన అత్తగారి ఇంటి నుంచి తల్లిగారి ఊరైన ఓదెలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణం మధ్యలో ఆమెకు ఒక్కసారిగా తీవ్ర ఛాతి నొప్పి రావడంతో బస్సులోనే స్పృహ తప్పి కుప్పకూలింది.

ఈ విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్ రాజు, కండక్టర్ సుమన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించారు. బస్సును నేరుగా ఓదెలలోని 108 అంబులెన్స్ పాయింట్‌కు తీసుకెళ్లి, మహిళను స్వయంగా అంబులెన్స్‌లో ఎక్కించి చికిత్స కోసం శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

మహిళ ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషించిన డ్రైవర్ రాజు, కండక్టర్ సుమన్‌ల సమయస్ఫూర్తిని ప్రయాణికులు, స్థానికులు ప్రశంసించారు. ఈ సందర్భంగా ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ వారిద్దరినీ శాలువాలతో సన్మానించి అభినందించారు.

ఆర్టీసీ సిబ్బంది చూపిన బాధ్యత, మానవత్వం పలువురికి ఆదర్శంగా నిలిచిందని స్థానికులు కొనియాడుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793