రెండు లారీల మధ్య నలిగిన కారు.. పసిబిడ్డతో సహా ముగ్గురు దుర్మరణం
రెండు లారీల మధ్య నలిగిన కారు.. పసిబిడ్డతో సహా ముగ్గురు దుర్మరణం
కృష్ణా–ఎన్టీఆర్ జిల్లాల సరిహద్దులోని పశ్చిమ బైపాస్ రోడ్డులో బీబిగూడెం సమీపంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రెండు భారీ లారీల మధ్య కారు నలిగిపోవడంతో నాలుగేళ్ల చిన్నారితో పాటు ఇద్దరు మృతి చెందగా, అదే ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా ప్రయాణిస్తున్న కంటైనర్ లారీ, ట్యాంకర్ మధ్యలో వెళ్తున్న కారు ఒక్కసారిగా ఇరుక్కుపోయింది. రెండు భారీ వాహనాలు బలంగా ఢీకొనడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి ఉండటం హృదయవిదారకంగా మారింది.
అదే సమయంలో కారు ముందు వెళ్తున్న బైక్‌ను కూడా ట్యాంకర్ ఢీకొట్టడంతో బైక్ రైడర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, గన్నవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నలిగిపోయిన కారులో చిక్కుకున్న మృతదేహాలను ఎంతో శ్రమించి బయటకు తీశారు.
ఈ ప్రమాదంతో పశ్చిమ బైపాస్ రోడ్డుపై కొంతసేపు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించి పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన గన్నవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగం వల్ల ప్రమాదం జరిగిందా? లేక ట్యాంకర్ బ్రేకులు విఫలమవడం వంటి సాంకేతిక కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. మృతుల వివరాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించే ప్రక్రియ కొనసాగుతోంది.

Post a Comment