సింగరేణికే తాటిచర్ల-2 బొగ్గు గని కేటాయింపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సింగరేణికే తాటిచర్ల-2 బొగ్గు గని కేటాయింపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వేలం లేకుండానే కేంద్ర నిర్ణయం.. 182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు
న్యూఢిల్లీ/వరంగల్, జూలై 7: సింగరేణి కాలరీస్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం కీలక ఊరట కల్పించింది. ఎలాంటి వేలం నిర్వహించకుండా తాటిచర్ల-2 బొగ్గు గనిని సింగరేణికే కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఢిల్లీలో ప్రకటించారు. ఈ నిర్ణయంతో సింగరేణి కార్మికులు, ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ అభివృద్ధి, సింగరేణి సంస్థ భవిష్యత్తు, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తాటిచర్ల-2 గనిని సింగరేణికే కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు తెలిపారు. ప్రధాని ఆమోదం అనంతరం సంబంధిత ఫైల్‌పై మంగళవారం సంతకం చేసినట్లు వెల్లడించారు.
2020 నుంచి ఇప్పటివరకు ఎలాంటి బొగ్గు గనినీ వేలం లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించలేదని, అయితే సింగరేణి ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి చెప్పారు. సింగరేణిలో ఉద్యోగాలు తగ్గడం, బొగ్గు ఉత్పత్తి క్షీణించడం, సంస్థకు రావాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోవడం వంటి పరిస్థితుల్లో నైని, తాటిచర్ల-2 గనుల కేటాయింపు సంస్థకు కొత్త ఊపునిస్తుందని పేర్కొన్నారు.
తాటిచర్ల-2 గనిలో సుమారు 182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఏటా సుమారు 6 మిలియన్ టన్నుల చొప్పున 40 నుంచి 50 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తి చేయవచ్చని మంత్రి వివరించారు. ఈ గనిలో లభించే బొగ్గు గ్రేడ్-8 నాణ్యతకు చెందినదని, సంస్థకు అధిక ఆదాయం అందిస్తుందని తెలిపారు.
ఈ గని ద్వారా సింగరేణికి దాదాపు రూ.64 వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని, వేలం లేకుండా కేటాయించడం వల్ల ఆక్షన్ ప్రీమియంగా చెల్లించాల్సిన రూ.2,550 కోట్లు ఆదా అవుతాయని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి రాయల్టీతో పాటు ఇతర మార్గాల ద్వారా సుమారు రూ.16 వేల కోట్ల ఆదాయం లభించనున్నదని, ఈ ప్రాజెక్టుతో సుమారు 1,200 మందికి అదనపు ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Post a Comment