5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్–2026లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల సత్తా
5 స్వర్ణ, 2 రజత, 4 కాంస్య పతకాలతో మొత్తం 11 పతకాలు సాధించిన జిల్లా పోలీసు సిబ్బంది
విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు.. జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్ష
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు సిబ్బంది 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్–2026లో అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఈ క్రీడల్లో జిల్లా పోలీసు సిబ్బంది మొత్తం 11 పతకాలు సాధించి తమ క్రీడా నైపుణ్యాన్ని మరోసారి నిరూపించారు.
ఈ పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు సిబ్బంది 5 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు గెలుచుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. విధి నిర్వహణలోనే కాకుండా క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బంది జిల్లాకు మంచి గుర్తింపు తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా విజేతలను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు. క్రీడల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి కృషి, పట్టుదల, క్రమశిక్షణ అభినందనీయమని పేర్కొన్నారు. విధులతో పాటు క్రీడలపై ఆసక్తి కనబరచి రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించడం గర్వకారణమన్నారు.
రాష్ట్ర స్థాయిలో సాధించిన ఈ విజయాలను మరింత ముందుకు తీసుకెళ్లి, త్వరలో జరిగే జాతీయ స్థాయి పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ పోలీసు శాఖతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని ఎస్పీ రోహిత్ రాజు ఆకాంక్షించారు.
క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని, పోలీసు విధుల్లో సమర్థవంతంగా పనిచేయడానికి అవి ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా జిల్లా పోలీసు సిబ్బంది ఇలాంటి పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ విజేతలకు అభినందనలు తెలిపారు.

Post a Comment