50 కోట్లతో పరార్.. నమ్మించి నట్టేట ముంచిన సిమెంట్ వ్యాపారి
హైదరాబాద్‌లో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. దాదాపు మూడు దశాబ్దాలుగా స్థానికంగా నమ్మకం సంపాదించుకున్న ఓ సిమెంట్ వ్యాపారి, అధిక వడ్డీల పేరుతో సుమారు 80 మంది నుంచి రూ.50 కోట్లకు పైగా వసూలు చేసి భార్యతో కలిసి పరారైన ఘటన కలకలం రేపుతోంది.
బాధితుల కథనం ప్రకారం.. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చక్రపురం, భగవాన్ కాలనీకి చెందిన పబ్బ చంద్రశేఖర్ "శ్రీ వెంకటేశ్వర మార్కెటింగ్" పేరుతో సిమెంట్ వ్యాపారం నిర్వహిస్తూ, ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. స్థానికంగా అందరితో సత్సంబంధాలు ఏర్పరుచుకుని నమ్మకాన్ని సంపాదించుకున్న చంద్రశేఖర్ అదే నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకొని భారీ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తన కూతురు వివాహం, తండ్రి అనారోగ్య చికిత్స, ఇంటి నిర్మాణం వంటి వ్యక్తిగత అవసరాలు ఉన్నాయని చెబుతూ ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద అప్పులు తీసుకున్నాడు. అలాగే సిమెంట్ కంపెనీల డిపాజిట్ స్కీమ్ పేరుతో రూ.50 లక్షలు జీఎస్టీ చెల్లిస్తే రూ.3 కోట్లు విడుదల అవుతాయని, పెట్టుబడులకు అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి పలువురి నుంచి భారీ మొత్తాలు సేకరించినట్లు బాధితులు తెలిపారు.
ఈ విధంగా సుమారు 80 మంది నుంచి రూ.50 కోట్లకు పైగా వసూలు చేసిన చంద్రశేఖర్ ఈ నెల 22వ తేదీ నుంచి తన రెండు సెల్‌ఫోన్ నంబర్లను స్విచ్‌ఆఫ్ చేసి, రాత్రికి రాత్రే భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. అంతకుముందే తన ఇద్దరు కుమార్తెలను తమ్ముడి ఇంట్లో వదిలి వెళ్లినట్లు సమాచారం. బాధితులు కుమార్తెల గురించి ఆరా తీస్తే, వారు స్విట్జర్లాండ్‌కు వెళ్లారని తప్పుడు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
మోసపోయామని గుర్తించిన బాధితులు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Post a Comment