మాజీ సర్పంచ్ దారుణ హత్య.. ఇంటి ముందు నిద్రిస్తుండగా మారణాయుధాలతో దాడి
మహబూబాబాద్ జిల్లాలో మాజీ సర్పంచ్ దారుణ హత్య.. ఇంటి ముందు నిద్రిస్తుండగా మారణాయుధాలతో దాడి
మహబూబాబాద్ జిల్లాలోని సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ పిట్టల యాకయ్య (57) దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంటి ముందు వరండాలో నిద్రిస్తుండగా గుర్తుతెలియని దుండగులు మారణాయుధాలతో దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి యాకయ్య తన ఇంటి ముందు వరండాలో నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అక్కడికి చేరుకుని విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. అనంతరం నిందితులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.
బుధవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూడగా యాకయ్య రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ హత్యకు వ్యక్తిగత విభేదాలు, పాత కక్షలు లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు స్థానికులను విచారిస్తున్నట్లు సమాచారం.
మాజీ సర్పంచ్ యాకయ్య హత్యతో సింగారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

Post a Comment