ఆషాఢ బోనాల జాతర, ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవ పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ
ఆషాఢ బోనాల జాతర, ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవ పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో నిర్వహించనున్న ఆషాఢ బోనాల జాతర, వార్షిక కళ్యాణోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమన్వయ సమావేశంలో పాల్గొన్న మంత్రి, అనంతరం ఆషాఢ బోనాల జాతర, ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవ పోస్టర్లను అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సుమారు 700 సంవత్సరాల చరిత్ర కలిగిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచారని అన్నారు. ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు ఎదుర్కోలు ఉత్సవంతో వేడుకలు ప్రారంభమవుతాయని, 21న ఉదయం 9 గంటలకు అమ్మవారి కళ్యాణోత్సవం, 22న సాయంత్రం 6 గంటలకు రథోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. క్యూలైన్లలో తోపులాటలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, వీఐపీ–వీవీఐపీ ప్రవేశ మార్గాల్లో భద్రతను మరింత పటిష్ఠం చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల సందేహాల నివృత్తి కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని కూడా సూచించారు.
ఆలయ పరిసరాల్లో ప్రత్యేక పుష్ప, విద్యుత్ దీపాలంకరణ, కళ్యాణ మండపం, రథోత్సవ ఏర్పాట్లు, ప్రసాదాల పంపిణీ, వాలంటీర్ల నియామకం వంటి అన్ని ఏర్పాట్లను దేవాదాయ శాఖ పూర్తి చేయాలని మంత్రి పేర్కొన్నారు. ఉత్సవాల విశిష్టతను ప్రజలకు తెలియజేసేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.
పోలీసు, ట్రాఫిక్ శాఖలు ట్రాఫిక్ మళ్లింపు, ప్రత్యేక పార్కింగ్, రద్దీ నియంత్రణ, మహిళలు, వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిశుభ్రత, పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మతులు, తాత్కాలిక మరుగుదొడ్లు, మొబైల్ టాయిలెట్లు, స్ట్రీట్ లైట్లు వంటి సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు.
వైద్య ఆరోగ్య శాఖ తాత్కాలిక వైద్య శిబిరాలు, 108 అంబులెన్స్‌లు, అత్యవసర వైద్య బృందాలు, ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అగ్నిమాపక శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.
లక్షలాది మంది భక్తులు హాజరయ్యే నేపథ్యంలో అనుమానితుల ఫొటోలను ప్రత్యేక వాల్ పోస్టర్లుగా ప్రదర్శించడం, తప్పిపోయే చిన్నారులను గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని పోలీసు శాఖకు మంత్రి సురేఖ సూచించారు. ఉత్సవాల విజయవంతమైన నిర్వహణకు ప్రతి శాఖ తన బాధ్యతలను సమయానికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

Post a Comment