అల్పపీడనం ఎఫెక్ట్.. నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం ఎఫెక్ట్.. నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్, జూలై 4: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశముండటంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడనం ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం పరిసర ప్రాంతాలు, పల్నాడు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశమున్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని, ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ ప్రజలకు సూచించింది. అధికారులు విడుదల చేసే తాజా వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Post a Comment