నకిలీ డాక్టర్ల గుట్టురట్టు.. 11 మంది నకిలీ వైద్యుల అరెస్ట్
నకిలీ డాక్టర్ల గుట్టురట్టు.. 11 మంది నకిలీ వైద్యుల అరెస్ట్
హైదరాబాద్: మహానగరం హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల వ్యవహారం కలకలం రేపింది. ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే ప్రజలకు చికిత్స అందిస్తున్న 11 మంది నకిలీ వైద్యులను సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి నకిలీ వైద్యుల ముఠాను పట్టుకున్నారు.
పోలీసుల దర్యాప్తులో నిందితులు ఎలాంటి గుర్తింపు పొందిన వైద్య డిగ్రీలు లేకపోయినా వైద్యులుగా చలామణి అవుతున్నట్లు తేలింది. ప్రిస్క్రిప్షన్లు రాయడం, ఇంజెక్షన్లు వేయడం, యాంటీబయాటిక్స్‌తో పాటు ఇతర మందులు ఇవ్వడం ద్వారా అమాయక ప్రజలకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వారి వద్ద చికిత్స పొందుతున్న ప్రజల ఆరోగ్యం, ప్రాణాలకు తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.
అరెస్టయిన వారిలో కొందరు నకిలీ సర్టిఫికెట్లను ఉపయోగించి ప్రైవేట్ క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు, మరికొందరు ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల పేర్లను ఉపయోగించుకుంటూ ప్రజలను నమ్మిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
దాడుల సందర్భంగా నిందితుల క్లినిక్‌ల నుంచి నకిలీ లెటర్‌హెడ్‌లు, అనుమతి లేని మందులు, వైద్య పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితుల వైద్య అర్హతలు, క్లినిక్‌ల నిర్వహణ, మందుల వినియోగానికి సంబంధించిన వివరాలపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.
అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ప్రజలు వైద్యం చేయించుకునే ముందు సంబంధిత వైద్యుడి అర్హతలు, రిజిస్ట్రేషన్ వివరాలను నిర్ధారించుకోవాలని సూచించారు. నకిలీ వైద్యుల గురించి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Post a Comment