21 ఏళ్లుగా గుర్తింపు కోసం పోరాటం.. కుమారుడితో ఇంటి ఎదుట తల్లి ధర్నా
21 ఏళ్లుగా గుర్తింపు కోసం పోరాటం.. కుమారుడితో ఇంటి ఎదుట తల్లి ధర్నా
జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల: పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సహజీవనం చేసి, కుమారుడు పుట్టిన తర్వాత తనను, తన బిడ్డను పట్టించుకోవడం లేదంటూ ఓ మహిళ తన కుమారుడితో కలిసి ధర్నాకు దిగిన ఘటన గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. “నా బిడ్డకు తండ్రి నువ్వే.. మాకు సమాజంలో గుర్తింపు కల్పించాలి” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన రేణుక చిన్నతనం నుంచే భీమ్‌నగర్‌కు చెందిన ఓ కుటుంబంలో పనిమనిషిగా పనిచేసేదని తెలిపింది. తనకు వయసు వచ్చిన తర్వాత ఆ ఇంటి యజమాని కుమారుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సహజీవనం చేశాడని, ఈ క్రమంలో తాను గర్భం దాల్చినట్లు రేణుక ఆరోపించింది.
గర్భం తొలగించేందుకు మాత్రలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో విషయం తన తల్లిదండ్రులకు తెలియడంతో వారు వచ్చి తనను ఇంటికి తీసుకెళ్లారని, అనంతరం ప్రసవం జరిగినట్లు వివరించింది. తనకు కుమారుడు జన్మించి 21 ఏళ్లు గడిచినా.. ఇప్పటివరకు తనను పెళ్లి చేసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రస్తుతం కుమారుడు పెద్దవాడయ్యాడని, తమకు సమాజంలో తగిన గుర్తింపు కల్పించాలని కోరుతూ శుక్రవారం ఆమె తన కుమారుడితో కలిసి సంబంధిత వ్యక్తి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఈ విషయంపై ప్రశ్నిస్తే తనను, తన కుమారుడిని చేతబడి చేసి చంపుతానంటూ బెదిరిస్తున్నాడని రేణుక ఆరోపించింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకుని తల్లి, కుమారుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనకు సంబంధించి తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ కల్యాణ్ తెలిపారు.
ఫిర్యాదు అందిన తర్వాత పూర్తి వివరాలను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Post a Comment