రాఖీ పండుగ రోజే విషాదం.. ఇద్దరు చిన్నారులతో సహా దంపతుల మృతి
పెందుర్తిలో ఘోర విషాదం.. ఆటో డ్రైవర్ కుటుంబం ఆత్మహత్య
రాఖీ పండుగ రోజే విషాదం.. ఇద్దరు చిన్నారులతో సహా దంపతుల మృతి
విశాఖపట్నం: రాఖీ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెందుర్తి పరిధిలోని చింతల అగ్రహారం ప్రాంతంలో ఆటో డ్రైవర్ తన భార్య, ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.
కొత్తవలసకు చెందిన మల్ల ప్రవీణ్ కుమార్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్యతో పాటు రెండేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రాఖీ పండుగ సందర్భంగా నిన్న కుటుంబ సభ్యులను కలుసుకుని రాఖీలు కట్టించుకున్న ప్రవీణ్ కుమార్.. అనంతరం రాత్రి సమయంలో తన కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్లకు ‘RIP’ అంటూ సందేశం పంపినట్లు సమాచారం.
ఆ సందేశం చూసిన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ప్రవీణ్ కుమార్ కుటుంబం ఉన్న చోటుకు చేరుకునేలోపే.. ఆయన తన భార్యతో పాటు ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే నలుగురూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.
రాఖీ పండుగ రోజున కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన కొద్దిసేపటికే ఈ విషాదం చోటుచేసుకోవడం బంధువులను, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇద్దరు చిన్నారులు కూడా మృతి చెందడంతో చింతల అగ్రహారం ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత సమస్యలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ కుమార్ పంపినట్లు చెబుతున్న ‘RIP’ సందేశంపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి దర్యాప్తు అనంతరం ఘటనకు అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Post a Comment