పెళ్లి వేడుకలో వధువు సోదరుడిపై దాడి రంగంలోకి పోలీసులు
పెళ్లి వేడుకలో వధువు సోదరుడిపై దాడి రంగంలోకి పోలీసులు
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 30: సిరిసిల్ల పట్టణంలోని ఓ ఆలయంలో పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా దాడి జరగడంతో కలకలం రేగింది. వధువు సోదరుడిపై అతని అత్తింటి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడిన ఘటన శివనగర్ శివాలయంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనతో పెళ్లికి హాజరైన బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శివనగర్ శివాలయంలో బీవై నగర్‌కు చెందిన కస్తూరి శ్రావణ్ కుమార్ సోదరి వివాహాన్ని ఆదివారం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో శ్రావణ్ కుమార్‌పై కొందరు వ్యక్తులు దాడికి దిగినట్లు సమాచారం.
శ్రావణ్ కుమార్‌కు గతంలో గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన వొడ్నాల సౌమ్యతో వివాహం జరిగినట్లు తెలుస్తోంది. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శ్రావణ్ కుమార్ సోదరి వివాహం సిరిసిల్లలో జరుగుతున్న విషయం తెలుసుకున్న సౌమ్య కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి దాడికి దారితీసినట్లు సమాచారం. సౌమ్య కుటుంబ సభ్యులు పథకం ప్రకారం సిరిసిల్లకు వచ్చి శ్రావణ్ కుమార్‌పై దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో శ్రావణ్ కుమార్‌తో పాటు మరికొందరికి గాయాలైనట్లు సమాచారం.
దాడి ఘటనపై బాధితులు సిరిసిల్ల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. పెళ్లి వేడుకలో చోటుచేసుకున్న ఈ దాడి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Post a Comment