జలుబు చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన నాలుగు నెలల బాబు.. తిరిగిరాని లోకాలకు
జలుబు చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన నాలుగు నెలల బాబు.. తిరిగిరాని లోకాలకు!
సూర్యాపేట, సెప్టెంబర్ 5: జలుబు సమస్యతో చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన నాలుగు నెలల పసికందు మృతి చెందడం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తీవ్ర కలకలం రేపింది. వైద్యుడు మందులు రాసిచ్చిన అనంతరం తమ బిడ్డ పరిస్థితి విషమించి మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించడంతో ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలం యండ్లపల్లి గ్రామానికి చెందిన రాము, ప్రీతి దంపతులకు నాలుగు నెలల మగబిడ్డ ఉన్నాడు. చిన్నారికి జలుబు సమస్య ఉండటంతో శుక్రవారం సాయంత్రం సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుడు చిన్నారిని పరీక్షించి సిరప్‌లు, టాబ్లెట్లు రాసిచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే మందులు ఇస్తుండగానే చిన్నారి పరిస్థితి విషమించి మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు. బిడ్డ మృతి విషయం తెలియడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. “జలుబుతో ఆస్పత్రికి తీసుకొచ్చాం.. నా కొడుకును నాకు ఇచ్చేయండి” అంటూ తల్లి చేసిన రోదనలు అక్కడున్న వారిని కలచివేశాయి.
విషయం తెలుసుకున్న బంధువులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఆరోపణలను ఖండించిన వైద్యుడు
తనపై వచ్చిన ఆరోపణలను వైద్యుడు మహేందర్‌రెడ్డి ఖండించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో చిన్నారిని ఆస్పత్రికి తీసుకొచ్చారని తెలిపారు. సీబీపీ రక్త పరీక్ష, ఎక్స్‌రే నిర్వహించి వాటిని పరిశీలించిన అనంతరం సిరప్‌లు, టాబ్లెట్లు రాసి పంపించినట్లు చెప్పారు.
“నేను ఆ బాబుకు ఎలాంటి వైద్యం చేయలేదు. పరీక్షలు నిర్వహించిన అనంతరం మందులు రాసి పంపించాను. ఇంటికి వెళ్లిన తర్వాత మందులను వారు ఏ విధంగా ఉపయోగించారో నాకు తెలియదు. మా వల్లే బాబు చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు” అని వైద్యుడు మహేందర్‌రెడ్డి తెలిపారు.
చిన్నారి మృతికి అసలు కారణం ఏమిటి? వైద్యంలో ఏదైనా లోపం జరిగిందా? అనే విషయాలు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. పోస్టుమార్టం, వైద్యపరమైన నివేదికలు వచ్చిన తర్వాతే మృతికి గల కారణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Post a Comment