మద్యానికి బానిస.. పైసల కోసం కన్నతల్లిని చంపిన కిరాతకుడు
మద్యానికి బానిస.. పైసల కోసం కన్నతల్లిని చంపిన కిరాతకుడు
సూర్యాపేట, సెప్టెంబర్ 4: మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్నతల్లినే రోకలిబండతో కొట్టి హత్య చేసిన దారుణ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
గ్రామానికి చెందిన షేక్ సైదాబీ తన కుమారుడు షేక్ సుభానితో కలిసి నివసిస్తోంది. సుభాని కొంతకాలంగా మద్యానికి బానిసై, తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తరచూ తల్లిని వేధించేవాడని సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం తల్లితో డబ్బుల విషయంలో గొడవకు దిగాడు.
వాగ్వాదం తీవ్రం కావడంతో సుభాని ఆగ్రహంతో రోకలిబండతో తల్లి సైదాబీ తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సుభాని భార్య కూడా ఏడాది క్రితమే అతడిని విడిచి వెళ్లిపోయినట్లు సమాచారం. అప్పటి నుంచి అతడు తల్లితోనే కలిసి ఉంటున్నాడు. మద్యం కోసం తరచూ తల్లిని వేధించేవాడని స్థానికులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment