కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. మహిళ మృతి
కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. మహిళ మృతి
కరీంనగర్, ఆగస్టు 30: కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాలీని కోళ్లను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో పలువురు గాయపడగా.. చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందినట్లు సమాచారం.
మంగపేట గ్రామానికి చెందిన కొంతమంది వ్యవసాయ కూలీలు కూలి పనుల నిమిత్తం ఆటో ట్రాలీలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల వైపు నుంచి వస్తున్న కోళ్ల డీసీఎం వ్యాన్.. ఆటో ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు ట్రాలీలో ప్రయాణిస్తున్న ఆరుగురు కూలీలు గాయపడ్డారు.
వారిలో ఓ వ్యక్తికి రెండు కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలై ఎముకలు విరిగినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను బయటకు తీసి 108 అంబులెన్స్‌ల ద్వారా కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగపేట గ్రామానికి చెందిన లింగాల దేవమ్మ అనే మహిళ మృతి చెందినట్లు సమాచారం. మిగతా క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంతో మంగపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, మృతులు మరియు క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికావాల్సి ఉంది.

Post a Comment