-->

మద్యానికి బదులు శానిటైజర్‌ తాగుతున్న మందుబాబులు షాకింగ్‌ ఘటన

మద్యానికి బదులు శానిటైజర్‌ తాగుతున్న మందుబాబులు షాకింగ్‌ ఘటన


మద్యానికి బదులు శానిటైజర్‌ తాగుతున్న మందుబాబులు షాకింగ్‌ ఘటన

విజయవాడ, ఆగస్టు 30: మద్యం ధరలు భరించలేక కొందరు మందుబాబులు ఏకంగా హ్యాండ్‌ శానిటైజర్‌ను మద్యంలా తాగుతున్న ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది. శానిటైజర్‌ ధర మద్యం కంటే తక్కువగా ఉండటంతో మత్తు కోసం దానిని నీటిలో కలిపి తాగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

విజయవాడలోని పటమట హైస్కూల్‌ రోడ్డుకు సమీపంలోని ఓ మెడికల్‌ షాప్‌లో గత మూడేళ్లుగా 100 మిల్లీలీటర్ల శానిటైజర్‌ బాటిళ్ల అమ్మకాలు భారీగా జరుగుతున్నట్లు ఔషధ నియంత్రణ విభాగం అధికారుల దృష్టికి వచ్చింది. ఇప్పటివరకు 50 వేలకు పైగా బాటిళ్లు విక్రయించినట్లు సమాచారం.

ఇంత పెద్ద మొత్తంలో శానిటైజర్‌ అమ్మకాలు జరగడంపై అనుమానం వచ్చిన ఔషధ నియంత్రణ విభాగం అధికారులు మెడికల్‌ షాపులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాప్‌ యజమానిని ప్రశ్నించగా విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.

రోజూ 25 నుంచి 30 మంది వరకు కేవలం శానిటైజర్‌ బాటిళ్ల కోసం వస్తుంటారని షాప్‌ యజమాని అధికారులకు తెలిపినట్లు సమాచారం. వారు శానిటైజర్‌ను ఎందుకు కొనుగోలు చేస్తున్నారనే విషయంపై ఆరా తీయగా.. మద్యానికి బదులుగా శానిటైజర్‌ను నీటిలో కలిపి తాగుతున్నారని చెప్పినట్లు తెలుస్తోంది.

ఒక్కో 100 మి.లీ. శానిటైజర్‌ బాటిల్‌ ధర సుమారు రూ.50 మాత్రమే ఉండటంతో, మద్యం కొనుగోలు చేయలేని కొందరు దీనికి అలవాటు పడినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ముఖ్యంగా చీప్‌ లిక్కర్‌ కంటే తక్కువ ధరకు లభిస్తుండటంతో మత్తు కోసం శానిటైజర్‌ను ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది.

ఈ విషయం తెలిసి అధికారులు సైతం షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. శానిటైజర్‌ మానవ వినియోగానికి ఉద్దేశించినది కాదని, దానిని తాగడం వల్ల తీవ్రమైన విషపూరిత ప్రభావాలు, అవయవాల దెబ్బతినడం, ప్రాణాపాయం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ వ్యవహారంపై ఔషధ నియంత్రణ విభాగం అధికారులు మరింత లోతుగా విచారణ చేపట్టినట్లు సమాచారం. శానిటైజర్‌ విక్రయాల వివరాలు, కొనుగోలుదారుల వినియోగం, విక్రయ నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793