నర్సు దారుణ హత్య.. అత్యాచారానికి యత్నించి గొంతు నులిమిన మెకానిక్
తుక్కుగూడలో నర్సు దారుణ హత్య.. అత్యాచారానికి యత్నించి గొంతు నులిమిన మెకానిక్
హైదరాబాద్, ఆగస్టు 30: హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రైమ్‌కేర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ నర్సు తన విశ్రాంతి గదిలో హత్యకు గురయ్యారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, బిహార్‌కు చెందిన మెకానిక్ సైనా ఉల్లానే హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఆదివారం అతడిని అరెస్టు చేశారు.
కిటికీ నుంచి లోపలికి ప్రవేశించి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి చెందిన బాధితురాలు ఈ ఏడాది జనవరిలో తుక్కుగూడలోని ప్రైమ్‌కేర్ ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగంలో చేరారు. ఆస్పత్రి సమీపంలో నర్సుల కోసం యాజమాన్యం విశ్రాంతి గదులను ఏర్పాటు చేసింది.
శుక్రవారం రాత్రి విధులు ముగించుకున్న అనంతరం ఆమె తన గదికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే గదిలో ఉండే మరో నర్సు ఆ సమయంలో విధుల్లో ఉండటంతో ఆమె ఒక్కరే ఉన్నారు. ఇదే అదునుగా భావించిన సైనా ఉల్లా కిటికీ ద్వారా గదిలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు.
మృతురాలిపై అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించి కేకలు వేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో నిందితుడు ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
మరుసటి రోజు వెలుగులోకి వచ్చిన ఘటన
శనివారం మరో నర్సు సారిక గదికి వచ్చి తలుపు తట్టినా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆస్పత్రి యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు కిటికీ ద్వారా గదిలోకి ప్రవేశించి చూడగా నర్సు విగతజీవిగా కనిపించారు. ఆమె ముఖం, కాళ్లపై గాయాలను గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
హత్య తర్వాత అత్యాచారం జరిగిందా?
నర్సును హత్య చేసిన అనంతరం కూడా నిందితుడు ఆమె మృతదేహంపై అత్యాచారానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయంపై పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుందని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటన రెండేళ్ల క్రితం కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో జరిగిన వైద్య విద్యార్థిని హత్య ఘటనను తలపిస్తోందని పోలీసులు పేర్కొన్నారు.
భద్రతా లోపాలపై విమర్శలు
నర్సుల కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి గదుల్లో కనీస భద్రతా ఏర్పాట్లు లేకపోవడంపై మృతురాలి బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి వెంట ఉన్న మెకానిక్ షెడ్ల వెనుక ఈ గదులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కిటికీలకు గ్రిల్స్ లేకపోవడంతో నిందితుడు సులభంగా లోపలికి ప్రవేశించగలిగాడని వారు ఆరోపిస్తున్నారు.
“కిటికీలకు గ్రిల్స్ ఉంటే ఈ దారుణం జరిగేది కాదు” అంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సిబ్బంది విశ్రాంతి తీసుకునే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, పటిష్టమైన తలుపులు, కిటికీ గ్రిల్స్ వంటి రక్షణ చర్యలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పేదరికాన్ని ఎదిరించి.. కుటుంబానికి అండగా నిలిచేందుకు ఉద్యోగంలో చేరి
మృతురాలు నిరుపేద కుటుంబానికి చెందిన యువతి. అంకంపాలెంలోని ట్రైబల్ గురుకుల పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు. అనంతరం భద్రాచలం గురుకుల కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్‌లో నర్సింగ్ శిక్షణ తీసుకున్నారు.
ఆమె తండ్రి కొంతకాలం క్రితమే అనారోగ్యంతో మృతి చెందారు. తల్లి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆమెకు ఓ సోదరుడు ఉన్నాడు. రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్న అతడు కూడా గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.
కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో నర్సుగా ఉద్యోగంలో చేరిన ఆమె ఇలా దారుణ హత్యకు గురికావడంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది. ఆమె అంత్యక్రియలు సోమవారం స్వగ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
“నా బిడ్డ రాఖీ పండక్కి కూడా ఇంటికి రాలేదు”
మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించడంతో అక్కడికి చేరుకున్న తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. “సెలవు లేదని నా బిడ్డ రాఖీ పండుగకు కూడా ఇంటికి రాలేదు. ఇప్పుడు శవంగా చూడాల్సి వచ్చింది” అంటూ తల్లి కన్నీటిపర్యంతమయ్యారు.
తన కుమార్తెను హత్య చేసిన నిందితుడికి కఠిన శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు. నిందితుడిని ఉరితీయాలని కోరారు.
మృతురాలి కుటుంబాన్ని బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్ పరామర్శించారు. ఆదివారం ఉస్మానియా ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టి నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం అత్యాచారం జరిగిందా లేదా అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Post a Comment