దంపతుల మధ్య కలహాలు.. తల్లి, ఆరేళ్ల కూతురు బలి
దంపతుల మధ్య కలహాలు.. తల్లి, ఆరేళ్ల కూతురు బలి
మంచిర్యాల జిల్లా, ఆగస్టు 31: దంపతుల మధ్య ఏర్పడిన కుటుంబ కలహాలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. భర్తతో జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ తల్లి.. తన ఆరేళ్ల కూతురిని నడుముకు కట్టుకుని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపూర్ గ్రామానికి చెందిన మెరుగు రజిత (28)కు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఎనుగుమట్ల గ్రామానికి చెందిన మెరుగు అంజన్నతో సుమారు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి అక్షిత (6) అనే కుమార్తెతో పాటు 18 నెలల కుమారుడు ఉన్నారు.
దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో గత నాలుగేళ్లుగా రజిత తన ఇద్దరు పిల్లలతో కలిసి లింగాపూర్‌లోని పుట్టింట్లోనే ఉంటోంది. ఆటో నడుపుతూ జీవనం సాగించే అంజన్న అప్పుడప్పుడు భార్య, పిల్లలను చూసేందుకు లింగాపూర్‌కు వచ్చేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం అంజన్న లింగాపూర్‌కు వచ్చి భార్య రజితతో గొడవ పడినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రజిత తన ఆరేళ్ల కుమార్తె అక్షితను వెంట తీసుకుని గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. అనంతరం కుమార్తెను నడుముకు కట్టుకుని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన రజిత తల్లి, ఇంట్లో ఉన్న అల్లుడు అంజన్నను తన కుమార్తె ఎక్కడుందని ప్రశ్నించింది. అయితే అంజన్న ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అదే సమయంలో గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో రెండు మృతదేహాలు తేలుతున్నట్లు స్థానికుల ద్వారా సమాచారం అందడంతో రజిత తల్లి అక్కడికి వెళ్లి పరిశీలించింది. బావిలో ఉన్న మృతదేహాలు తన కుమార్తె రజిత, మనవరాలు అక్షితవేనని గుర్తించి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎస్సై గుండేటి రాజవర్దన్ ఆధ్వర్యంలో మృతదేహాలను బావిలో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తుండగా, పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

Post a Comment