-->

చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టిన టీచర్లు.. ఆటపాటలతో సందడి

 

చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టిన టీచర్లు.. ఆటపాటలతో సందడి

చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టిన టీచర్లు.. ఆటపాటలతో సందడి

కొత్తగూడెం, సెప్టెంబర్ 3: ఎప్పుడూ తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీలు పడుతూ, విద్యార్థులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు ఒక్కసారిగా చిన్నపిల్లల్లా మారిపోయారు. మైదానంలో ఆటలు ఆడుతూ, కేరింతలు కొడుతూ ఉల్లాసంగా గడిపారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ 12వ వార్డులో ఉన్న మోడ్రన్ ఇఖ్రా స్కూల్లో టీచర్లకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు.

ఉపాధ్యాయులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమలోని చిన్ననాటి ఆటల స్ఫూర్తిని మరోసారి చాటుకున్నారు. రోజువారీ బోధనా బాధ్యతల నుంచి కాస్త విరామం తీసుకుని ఆటపాటల్లో మునిగిపోయారు. ఒకరిపై ఒకరు సరదాగా పోటీ పడుతూ, నవ్వులు, కేరింతలతో పాఠశాల ప్రాంగణాన్ని సందడిగా మార్చారు.

గురువులను ప్రతిరోజూ గౌరవించాలి

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ.. అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలి, విజ్ఞాన కాంతులను పంచుతూ దేశ అభివృద్ధికి బాటలు వేసే భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు.

డాక్టర్లు, ఇంజినీర్లు, పోలీసులు, రాజకీయ నాయకులు తదితర వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని అన్నారు. అయితే ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత తమ ఎదుగుదలకు కారణమైన గురువులను మరచిపోవడం బాధాకరమని పేర్కొన్నారు.

ఉపాధ్యాయుడి పాత్ర ఎంతో గొప్పది

ఫిన్‌లాండ్ వంటి దేశాల్లో ఉపాధ్యాయులకు ఎంతో ఉన్నతమైన గౌరవం ఇస్తారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవుల్లో ఉన్నవారితో పోల్చినా ఉపాధ్యాయులకు సమాజంలో ప్రత్యేక గౌరవం ఉంటుందని తెలిపారు.

ప్రస్తుతం మనం అనుభవిస్తున్న హోదా, ఆస్తి, అంతస్తులు, స్థాయిల వెనుక చిన్నతనంలో చేయిపట్టి అక్షరాలు నేర్పిన గురువుల కృషి ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు.

గురువే దైవాన్ని చూపించే మార్గదర్శి

తులసీదాస్‌ చెప్పినట్లు.. దైవం, గురువు ఇద్దరూ ఎదురుగా నిలబడితే ముందుగా గురువుకే నమస్కరిస్తాను.. ఎందుకంటే దైవాన్ని గుర్తించే జ్ఞానాన్ని ప్రసాదించింది గురువే అనే భావాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఉపాధ్యాయులను కేవలం ఉపాధ్యాయుల దినోత్సవం రోజున మాత్రమే కాకుండా ప్రతిరోజూ, ప్రతిక్షణం గౌరవించాలని విద్యార్థులకు సూచించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమైనదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు పర్వీన్ సుల్తానా, విజయలక్ష్మి, సల్మా, సరస్వతి, నసరత్, జేఫీషా, లతీఫా, అనిత, రుభీనా, నాజీయా, సుహాన, సల్మా జబీన్, శీరిషా తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.