-->

అదుపుతప్పిన ఆర్టీసీ అద్దె బస్సు.. పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లి

 

పలు వాహనాలు ధ్వంసం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

అదుపుతప్పిన ఆర్టీసీ అద్దె బస్సు.. పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లి

పలు వాహనాలు ధ్వంసం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 12: కారును తప్పించబోయిన ఆర్టీసీ అద్దె బస్సు అదుపుతప్పి పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో చోటుచేసుకుంది. బస్సు పలు వాహనాలను ఢీకొట్టడంతో అవి ధ్వంసమయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాటసింగారం గ్రామపంచాయతీ పరిధిలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద గురువారం ఉదయం సుమారు 10.45 గంటల సమయంలో డీజిల్ కోసం కారు, ఆటోతో పాటు పలు వాహనాలు వరుసలో నిలిచాయి. అదే సమయంలో దిల్సుఖ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు దిల్సుఖ్‌నగర్ నుంచి చౌటుప్పల్ వైపు వెళ్తోంది.

పెట్రోల్ బంక్ సమీపానికి బస్సు చేరుకున్న సమయంలో ఓ కారు అడ్డుగా రావడంతో దానిని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి నేరుగా పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. డీజిల్ కోసం వేచి ఉన్న వాహనాలను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో స్విఫ్ట్ కారు, ట్రాలీ ఆటోతో పాటు పెట్రోల్ బంక్‌కు చెందిన ఆయిల్ డిస్ప్లే, పెట్రోల్ గన్, పిల్లర్, విద్యుత్ తీగలు ధ్వంసమయ్యాయి. బస్సు వేగంగా దూసుకొస్తున్న విషయాన్ని గమనించిన పలువురు వెంటనే అక్కడి నుంచి పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది.

ఘటనపై పెట్రోల్ బంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Blogger ఆధారితం.