డీసీఎంలో భారీ అగ్నిప్రమాదం.. వ్యక్తితో పాటు 200కు పైగా మేకలు సజీవ దహనం
డీసీఎంలో భారీ అగ్నిప్రమాదం.. వ్యక్తితో పాటు 200కు పైగా మేకలు సజీవ దహనం
మహబూబ్‌నగర్: జిల్లాలో తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భూత్పూర్ పరిధిలో జాతీయ రహదారిపై మేకలను తరలిస్తున్న డీసీఎంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తితో పాటు 200లకు పైగా మేకలు సజీవ దహనమైనట్లు సమాచారం.
గురువారం తెల్లవారుజామున కర్నూలు మార్గంలో మేకల లోడుతో డీసీఎం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కొద్దిసేపటికే మంటలు భారీగా వ్యాపించాయి. దీంతో వాహనంలో ఉన్న మేకలు బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో పెద్ద సంఖ్యలో సజీవ దహనమయ్యాయి.
మంటల్లో చిక్కుకున్న ఓ వ్యక్తి కూడా బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే డీసీఎం వాహనం పూర్తిగా దగ్ధమైంది. మేకలు పెద్ద సంఖ్యలో మృతి చెందడంతో ఘటనాస్థలిలో విషాదకర పరిస్థితి నెలకొంది.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. డీసీఎంలో మంటలు ఎలా చెలరేగాయి? షార్ట్‌సర్క్యూట్ కారణమా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన వ్యక్తి వివరాలు, మేకల యజమాని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

Post a Comment