దొంగల ఆటకు చెక్ పెట్టిన నిర్మల్ పోలీసులు.. 25 చోరీ కేసులు ఛేదన
దొంగల ఆటకు చెక్ పెట్టిన నిర్మల్ పోలీసులు.. 25 చోరీ కేసులు ఛేదన
నిర్మల్: జిల్లాలో దేవాలయాలు, ఇళ్లు, దుకాణాలను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా ఆటకు నిర్మల్ పోలీసులు చెక్ పెట్టారు. జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘టైగర్స్ టాస్క్ ఫోర్స్’ ఆధ్వర్యంలో చేపట్టిన దర్యాప్తులో నలుగురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
భైంసా ASP, నిర్మల్ DSPల ఆధ్వర్యంలో సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలు, గత నేరాల వివరాలను విశ్లేషించారు. ఈ క్రమంలో నిందితులకు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 25 దొంగతనం కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే 16 కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేశారు.
12 కిలోల వెండి.. కిరీటాలు, నగదు స్వాధీనం
పోలీసులు నిందితుల నుంచి 12 కిలోల వెండి ఆభరణాలు, వివిధ ఆలయాలకు చెందిన కిరీటాలు, వెండి వస్తువులు, నగదు, కారు, మెల్టింగ్ మెషిన్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న వాటిలో:
నిస్సాన్ మాగ్నైట్ కారు – 1
వెండి ఆభరణాలు – సుమారు 12 కిలోలు
మెల్టింగ్ మెషిన్ – 1
గ్యాస్ పైప్ మెషిన్ – 1
నగదు – రూ.67,000
నిందితులు వీరే..
పోలీసులు గుర్తించిన నిందితుల్లో మారేపెద్ది రాజశేఖర్ (28), గడ్చంద రాజేశ్వర్ (26), కల్గద్దవార్ శ్రీకాంత్ (22), సారా సాయికిరణ్ (30) ఉన్నారు. వీరు నిర్మల్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందినవారిగా పోలీసులు తెలిపారు.
ఆలయాలే టార్గెట్
అయ్యప్ప ఆలయంలో అమ్మవారి మూలవిరాట్టు కిరీటం, ఉత్సవమూర్తి వెండి కిరీటం, వినాయక కిరీటం; మహాలక్ష్మి ఆలయంలో వెండి నడుము గొలుసు, నగదు; శాస్త్రినగర్ ఆంజనేయస్వామి ఆలయంలో వెండి కిరీటాలు, వినాయక తొండం, చెవులు, వెండి హారం తదితరాలను పోలీసులు రికవరీ చేశారు.
అలాగే ఇందిరానగర్, ప్రియదర్శిని నగర్, శాస్త్రినగర్, ఏఎన్ రెడ్డి కాలనీ, సారంగాపూర్–వంజర, ఆలూర్, కౌట్ల-కె, లోకేశ్వరం–కిష్టాపూర్, మామడ, లక్ష్మణచాంద తదితర ప్రాంతాల్లో జరిగిన చోరీ కేసుల్లో సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
ఏపీలోనూ చోరీలు
నిందితుల ప్రమేయం ఆంధ్రప్రదేశ్‌లోని ఎలూరు III టౌన్, గన్నవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీల్లోనూ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎలూరులో 500 గ్రాముల వెండి బిస్కెట్, గన్నవరంలో 200 గ్రాముల వెండి బిస్కెట్‌ను రికవరీ చేశారు.
పోలీసు బృందాలకు ఎస్పీ అభినందనలు
వరుస దేవాలయ చోరీలు, హౌస్ బ్రేకింగ్ కేసులను ఛేదించడంలో పోలీసు బృందాలు సమన్వయంతో పనిచేశాయని ఎస్పీ డా. జి. జానకి షర్మిల తెలిపారు. కేసుల ఛేదనలో కృషి చేసిన భైంసా ASP సాయి కిరణ్, IPS, నిర్మల్ DSP శ్రీనివాస్, CIలు కృష్ణ, సమ్మయ్య, SIలు లింబాద్రి, గణేష్, శ్రీకాంత్, అశోక్, ఎస్.కె. గఫార్ తదితరులను ఎస్పీ అభినందించారు.
టైగర్స్ టాస్క్ ఫోర్స్ ద్వారా జిల్లాలో ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, దేవాలయాలు, ఇళ్లు, దుకాణాలను లక్ష్యంగా చేసుకునే దొంగలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

Post a Comment