-->

చుక్క పాలు లేకుండానే కల్తీ పనీర్.. హైదరాబాద్‌లో 3 డెయిరీల లైసెన్సులు సస్పెండ్

 

చుక్క పాలు లేకుండానే కల్తీ పనీర్.. హైదరాబాద్‌లో 3 డెయిరీల లైసెన్సులు సస్పెండ్

చుక్క పాలు లేకుండానే కల్తీ పనీర్.. హైదరాబాద్‌లో 3 డెయిరీల లైసెన్సులు సస్పెండ్

హైదరాబాద్: అధికారులు ఎన్ని దాడులు నిర్వహిస్తున్నా కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో పాలు ఉపయోగించకుండానే రసాయనాలతో పనీర్ తయారు చేస్తున్న డెయిరీల బాగోతం వెలుగులోకి వచ్చింది. టీజీ సేఫ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు డెయిరీల్లో తీవ్ర ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడ్డాయి.

శనివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు, ‘హెచ్-ఫాస్ట్’ అధికారులతో కూడిన 12 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతంతో పాటు పరిసర జిల్లాల్లోని 14 డెయిరీ ఉత్పత్తుల తయారీ, రిటైల్ యూనిట్లపై మెరుపు దాడులు నిర్వహించాయి.

ఈ తనిఖీల్లో కొన్ని డెయిరీల్లో పాలు లేకుండానే రసాయనాలు, ఇతర పదార్థాలను ఉపయోగించి పనీర్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తయారీ కేంద్రాల్లో బొద్దింకలు, ఈగలు కనిపించడంతో పాటు తీవ్ర పారిశుధ్య లోపాలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా పాలను ఎక్కడి నుంచి సేకరిస్తున్నారనే వివరాలకు సంబంధించిన రికార్డులు కూడా నిర్వహించకపోవడాన్ని అధికారులు గుర్తించారు.

ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న లక్ష్మీ ఫుడ్స్, ధనలక్ష్మీ డెయిరీ, నటరాజ్ మిల్క్ ప్రొడక్ట్స్కు సంబంధించిన ఫుడ్ సేఫ్టీ (FSSAI) లైసెన్సులను అధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు. ఆయా సంస్థల వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేశారు.

అదే సమయంలో శ్రీ మహాలక్ష్మీ, అనిత డెయిరీలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు, గీతా డెయిరీ, నర్ముల్ డెయిరీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

గ్లిజరాల్ మోనోస్టియరేట్ స్వాధీనం

దాడుల్లో పెద్ద మొత్తంలో అనుమానాస్పద పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సుమారు 1 టన్ను లూజ్ పామాయిల్, 475 కిలోల గ్లిజరాల్ మోనోస్టియరేట్ ఉన్నాయి. వీటితో పాటు మావీస్ క్లాసిక్ ప్రీమియం కుకింగ్ క్రీమ్‌కు చెందిన 1,760 ప్యాకెట్లు, 150 కిలోల స్కిమ్డ్ మిల్క్ పౌడర్ను సీజ్ చేశారు.

స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాల మొత్తం విలువ సుమారు రూ.7,19,340 ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

కల్తీ పనీర్, నకిలీ పాల ఉత్పత్తుల తయారీపై మరిన్ని తనిఖీలు కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.