హనుమకొండలో పెను ప్రమాదం.. విద్యుత్ తీగలు చుట్టుకుని ఆర్టీసీ బస్సు బీభత్సం
హనుమకొండలో పెను ప్రమాదం.. విద్యుత్ తీగలు చుట్టుకుని ఆర్టీసీ బస్సు బీభత్సం
చెట్టు కూలి రెండు ఆటోలు, రెండు బైకులు ధ్వంసం.. తృటిలో తప్పిన ప్రాణనష్టం
హనుమకొండ నగర నడిబొడ్డున చోటుచేసుకున్న ప్రమాదం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పబ్లిక్ గార్డెన్ మూలమలుపు వద్ద వేగంగా మలుపు తిరుగుతుండగా విద్యుత్ తీగలు బస్సుకు చుట్టుకున్నాయి. దీంతో విద్యుత్ తీగలకు ఆనుకుని ఉన్న భారీ వృక్షం ఒక్కసారిగా నేలకూలింది.
ఈ ఘటనలో అక్కడ నిలిపి ఉంచిన రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ చెట్టు కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణనష్టం తప్పింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ప్రమాదం కారణంగా అక్కడ రాగిజావ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న ఓ నిరుపేద వ్యక్తి వ్యాపార బండి కూడా పూర్తిగా ధ్వంసమైంది. దీంతో అతని జీవనోపాధి దెబ్బతింది. తన బండి ధ్వంసం కావడంతో సుమారు రూ.50 వేలకుపైగా నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం స్పందించి తనకు ఆర్థిక సాయం అందించాలని బాధితుడు వేడుకున్నాడు.
ప్రమాద సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. విద్యుత్ తీగలు, కూలిన చెట్టు కారణంగా మరింత ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు.
ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు రద్దీ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా, వేగ నియంత్రణతో వాహనాలు నడపాలని స్థానికులు కోరుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందనే ఆరోపణలపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే నష్టపోయిన వాహన యజమానులు, నిరుపేద వ్యాపారికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.
తృటిలో ప్రాణనష్టం తప్పిన ఈ ఘటనతో హనుమకొండలో విద్యుత్ తీగలు, రహదారి పక్కన ఉన్న భారీ వృక్షాల భద్రతపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

Post a Comment