ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడుదాం: రాష్ట్ర జేఏసీ
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడుదాం: రాష్ట్ర జేఏసీ
హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్ఆర్డీఎస్-ఎఫ్టీఈ ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు, ముఖ్యంగా పే స్కేల్ సాధనే ప్రధాన లక్ష్యంగా అందరూ ఐక్యంగా, సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర జేఏసీ పిలుపునిచ్చింది.
హైదరాబాద్‌లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల చైర్మన్లు, రాష్ట్ర, జిల్లా సంఘాల బాధ్యులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఎలబద్రి లింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కో-చైర్మన్లు అంజిరెడ్డి, విజయ్, వెంకట్రాంరెడ్డి, నాగభూషణం, రామకృష్ణ, కృష్ణ, గిరి, ముక్కంటి, గురుపాదం, రఘు, గురుంచిరాన్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గత మూడు సంవత్సరాలుగా జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన పరిణామాలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగులకు త్వరగా పే స్కేల్ సాధించడమే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించారు.
ఇందులో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను త్వరలో కలవాలని సమావేశంలో నిర్ణయించారు. ఉద్యోగుల పే స్కేల్ అంశాన్ని ముఖ్యమంత్రి ద్వారా అధికారికంగా ప్రకటించేలా చొరవ తీసుకోవాలని మంత్రిని కోరనున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు.
అయితే ఇతర అంతర్గత అంశాలు, చర్చల నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి చేపట్టాలని భావించిన కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.
సమావేశానికి హాజరై విజయవంతం చేసిన అన్ని జిల్లాల చైర్మన్లు, రాష్ట్ర, జిల్లా సంఘాల బాధ్యులకు రాష్ట్ర జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్‌లో మరింత సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చింది.

Post a Comment