వరుస దొంగతనాలతో ప్రజల్లో భయాందోళన.. సీసీ కెమెరాల్లో ఇద్దరు నిందితుల దృశ్యాలు
వరుస దొంగతనాలతో ప్రజల్లో భయాందోళన.. సీసీ కెమెరాల్లో ఇద్దరు నిందితుల దృశ్యాలు
తాండూరు: తాండూరు పట్టణంలో దొంగలు మరోసారి హల్‌చల్ చేశారు. అర్ధరాత్రి ఓ ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇటీవల పట్టణంలో వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మరో చోరీ జరగడంతో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాలన్నా స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఈ నెల 4న తాండూరు పట్టణంలో వరుసగా నాలుగు చోరీలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగిన పది రోజులకే మరోసారి దొంగలు చోరీకి పాల్పడటం కలకలం రేపుతోంది. అర్ధరాత్రి ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు విలువైన వస్తువుల కోసం ఇల్లంతా వెతికినట్లు తెలుస్తోంది.
ఇంటి యజమాని తన సెల్‌ఫోన్‌లో సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించడంతో చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు దొంగల కదలికలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైనట్లు సమాచారం. అయితే చోరీకి గురైన నగదు, బంగారం, ఇతర వస్తువుల వివరాలు, వాటి మొత్తం విలువ ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
తాండూరు పట్టణంలో వరుసగా చోరీలు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రాత్రి వేళల్లో గస్తీని పెంచడంతో పాటు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి త్వరగా అరెస్టు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Post a Comment