సచివాలయ మహిళా ఉద్యోగినులకు బతుకమ్మ కానుకల పంపిణీ
సచివాలయ మహిళా ఉద్యోగినులకు బతుకమ్మ కానుకల పంపిణీ
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ – మహిళా ఉద్యోగినుల్లో పండుగ ఉత్సాహం
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని సచివాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులకు సాంస్కృతిక శాఖ తరఫున బతుకమ్మ కానుకలను పంపిణీ చేశారు.
గౌరవ పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనల మేరకు, యువజనాభ్యుదయ, పర్యాటక, సాంస్కృతిక శాఖల ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. వాణి ప్రసాద్ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగినులందరికీ సాంస్కృతిక శాఖ సెక్షన్ ఆఫీసర్ గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ చేతుల మీదుగా బతుకమ్మ కానుకలను అందజేశారు.
తెలంగాణ ఆడపడుచులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా ఉద్యోగినులకు కానుకలు అందించడం ఆనందంగా ఉందని కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగ ప్రాధాన్యతను చాటడంతో పాటు, మహిళా ఉద్యోగినుల్లో పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడిందని తెలిపారు.
కానుకలు అందుకున్న మహిళా ఉద్యోగినులు సంతోషం వ్యక్తం చేస్తూ, బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ప్రత్యేకంగా కానుకలు అందజేసిన సాంస్కృతిక శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగల సందర్భంగా మహిళా ఉద్యోగినులను ప్రోత్సహించే ఇటువంటి కార్యక్రమాలు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు.

Post a Comment