కార్తీక మాస మహోత్సవాలు.. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు ప్రత్యేక పూజలు
కొత్తగూడెం బూడిదగడ్డలో వైభవంగా కార్తీక మాస మహోత్సవాలు.. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు ప్రత్యేక పూజలు
కొత్తగూడెం: భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని బూడిదగడ్డ బస్తీ (విభూదిపురం)లో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ మహాంకాళి అమ్మవారి దేవాలయంలో కార్తీక మాస మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
బూడిదగడ్డ బస్తీలోని శ్రీశ్రీశ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ భాగ్యేశ్వర స్వామి వారి పంచాయతన క్షేత్రంలో ఈ నెల నవంబర్ 10వ తేదీ మంగళవారం నుంచి డిసెంబర్ 8వ తేదీ మంగళవారం వరకు నెల రోజుల పాటు వార్షిక కార్తీక మాస మహోత్సవాలు నిర్వహించనున్నారు. చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సర కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి కార్తీక బహుళ అమావాస్య వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.
ఈ సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, స్వామివారికి పూజలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా భక్తులు స్వయంగా తమ చేతులతో శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ భాగ్యేశ్వర స్వామివారికి అభిషేకాలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తున్నారు. అభిషేకాల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేయనున్నారు.
కార్తీక మాసంలో శివారాధనకు విశేష ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. ఈ మహోత్సవాల నిర్వహణకు భక్తులు తమ శక్తి మేరకు ధన, ద్రవ్య, వస్తు రూపాల్లో సహాయ సహకారాలు అందించి ఉత్సవాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమాలకు కాళీ ఉపాసకులు శ్రీ నరేంద్రభవానీ స్వామి ఆధ్వర్యం వహించనుండగా, ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు స్థలదాత ఈడ్పుగంటి శ్రీనివాసరావు సహకారం అందిస్తున్నారు.
కార్తీక మాసం సందర్భంగా నిర్వహించే ఈ మహోత్సవాల్లో పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించుకుని శ్రీ భాగ్యేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
వేదిక: శ్రీశ్రీశ్రీ మహాంకాళి అమ్మవారి దేవాలయం, బూడిదగడ్డ బస్తీ, కొత్తగూడెం.

Post a Comment