కరీంనగర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. అరేబియన్ మండి తిన్న 20 మందికి అస్వస్థత!
కరీంనగర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. అరేబియన్ మండి తిన్న 20 మందికి అస్వస్థత!
కరీంనగర్: నగరంలో మరోసారి ఆహార భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. కోర్టు చౌరస్తా సమీపంలోని అరేబియన్ మండి రెస్టారెంట్‌లో ఆహారం తీసుకున్న దాదాపు 20 మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. మండి తిన్న అనంతరం వాంతులు, విరేచనాలతో బాధపడుతూ పలువురు ఆసుపత్రులకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం కొందరు కస్టమర్లు సదరు రెస్టారెంట్‌కు వెళ్లి మండి ఆహారం తీసుకున్నారు. అనంతరం ఇళ్లకు చేరుకున్న కొద్దిసేపటికే వారికి వాంతులు, విరేచనాలు ప్రారంభమైనట్లు బాధితులు చెబుతున్నారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్య చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించారు. ఈ ఘటనలో వంశీ అనే యువకుడు ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు తెలిసింది.
అయితే, ఈ ఘటనకు రెస్టారెంట్‌లో తీసుకున్న ఆహారమే కారణమా? ఆహార పదార్థాల నాణ్యతలో లోపాలున్నాయా? అన్న విషయాలు అధికారిక విచారణలో తేలాల్సి ఉంది.
ఇటీవల కేఎఫ్‌సీ ఘటన.. మరువకముందే మరో ఆరోపణ
ఇటీవల కరీంనగర్‌లో కేఎఫ్‌సీ ఆహార నాణ్యతకు సంబంధించిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆ ఘటన మరువకముందే మరో రెస్టారెంట్‌లో ఆహారం తీసుకున్న పలువురు అస్వస్థతకు గురయ్యారనే ఆరోపణలు రావడం నగర ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల నిల్వ, మాంసం నాణ్యత, వంటగది పరిశుభ్రతపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులకు సవాల్!
ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం కావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో ఉపయోగించిన మాంసం, ఇతర ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రెస్టారెంట్ వంటగది పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానం, వాటి నాణ్యతపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజలకు రుచికరమైన ఆహారం అందించడంతో పాటు నాణ్యత, పరిశుభ్రత పాటించడం కూడా రెస్టారెంట్ల బాధ్యత. ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు మేల్కొని తనిఖీలు ముమ్మరం చేస్తారా? బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారా? అన్నది వేచి చూడాలి.

Post a Comment