ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఏడు బోగీలు, ఇంజన్!

 

గౌహతి సమీపంలో కోల్‌కతా–సైరంగ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం.. పలువురు ప్రయాణికులకు గాయాలు

అస్సాంలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఏడు బోగీలు, ఇంజన్!

గౌహతి సమీపంలో కోల్‌కతా–సైరంగ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం.. పలువురు ప్రయాణికులకు గాయాలు

గౌహతి, నవంబర్ 11: అస్సాం రాష్ట్రంలో బుధవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. గౌహతి శివార్లలోని దిగారు సమీపంలో కోల్‌కతా–సైరంగ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన ఏడు బోగీలతో పాటు ఇంజన్ పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు ప్రాథమిక సమాచారం. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రాథమిక వివరాల ప్రకారం.. మిజోరం నుంచి కోల్‌కతాకు ప్రయాణిస్తున్న ఈ రైలు నవంబర్ 11వ తేదీ ఉదయం సుమారు 6:54 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.

గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద స్థలానికి సహాయక రైలును పంపించారు. రైల్వే అధికారులు, రైల్వే రక్షణ దళం (RPF), పోలీసులు, స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మిగిలిన ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేపట్టారు.

ప్రాణనష్టం లేదని రైల్వే శాఖ ప్రకటన

నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (NFR) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కపింజల్ కిషోర్ శర్మ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే గాయపడిన వారి సంఖ్య, వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

రైళ్ల రాకపోకలకు అంతరాయం

రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, మరికొన్ని రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. రైల్వే జనరల్ మేనేజర్‌తో పాటు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి బయలుదేరారు.

ఇదిలా ఉండగా, అసలు ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రైల్వే శాఖ అధికారులు ఘటనపై విచారణ చేపట్టే అవకాశం ఉంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

Blogger ఆధారితం.