యాదగిరిగుట్టలో ఈ నెల 20 నుంచి వైభవంగా కార్తీకోత్సవాలు

 

యాదగిరిగుట్టలో ఈ నెల 20 నుంచి వైభవంగా కార్తీకోత్సవాలు

యాదగిరిగుట్టలో ఈ నెల 20 నుంచి వైభవంగా కార్తీకోత్సవాలు

తొలిసారిగా మూడు రోజుల పాటు నిర్వహణ.. కోటి పుష్పార్చనకు ఏర్పాట్లు

యాదాద్రి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు కార్తీకోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిసారిగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను భవిష్యత్తులో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆలయ ఈవో భవానీశంకర్ తెలిపారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఎల్‌నినో ప్రభావం నుంచి బయటపడి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఈ నెల 19, 20 తేదీల్లో కోటి పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు

ఈ నెల 20న కార్తీకోత్సవాల ప్రారంభం సందర్భంగా మాడవీధిలో సహస్ర అవధాని నాగఫణి శర్మ ప్రవచనం, తేలు విజయ్ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు.

నవంబర్ 21న ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్‌తో భక్తి సంగీత విభావరి ఏర్పాటు చేశారు. నవంబర్ 22న పరప్పర వారిచే ఒడిస్సీ, పేరిణి నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నారు. భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు సాంస్కృతిక కళారూపాలను అందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

వైటీడీ పాలకవర్గం తీర్మానం మేరకు ఉత్సవాల కార్యక్రమాలను రూపొందించినట్లు ఈవో పేర్కొన్నారు. ఉత్సవాలపై భక్తులకు విస్తృతంగా సమాచారం చేరవేసేందుకు పలు ప్రాంతాల్లో హోర్డింగులు ఏర్పాటు చేయడంతో పాటు సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు.

మంత్రుల చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ

కార్తీకోత్సవాల ప్రచార పోస్టర్‌ను శనివారం హైదరాబాద్‌లో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భవానీశంకర్‌తో పాటు ఆలయ అధికారులు పాల్గొన్నారు.

మూడు రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు.

Blogger ఆధారితం.