బియ్యం వ్యాపారులపై పౌరసరఫరాల శాఖ ఉక్కుపాదం.. రాష్ట్రవ్యాప్తంగా 370 కేసులు నమోదు!
బియ్యం వ్యాపారులపై పౌరసరఫరాల శాఖ ఉక్కుపాదం.. రాష్ట్రవ్యాప్తంగా 370 కేసులు నమోదు!
- 2,686 ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు
- 25 కిలోల బియ్యం నింపి 26 కిలోలుగా విక్రయిస్తున్న వ్యాపారుల గుట్టురట్టు
- ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
- రేషన్ బియ్యం అక్రమ నిల్వదారులపై పీడీ యాక్టు ప్రయోగిస్తాం: కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
హైదరాబాద్: బియ్యం మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయించడం, తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కొరడా ఝళిపించింది. వినియోగదారులను దోచుకుంటున్న వ్యాపారుల ఆట కట్టించేందుకు ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్స్ (ETF), తూనికలు-కొలతల (లీగల్ మెట్రాలజీ) శాఖ అధికారులు సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గత నెల 29 నుంచి ఈ నెల 5 వరకు చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 370 కేసులు నమోదు చేశారు.
ఈ వివరాలను పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇటీవల ప్రధాన బియ్యం రకాలపై గరిష్ఠ చిల్లర ధరలను (MRP) నిర్ణయించింది. బీపీటీ, కేఎన్ఎం రకాల బియ్యం కిలో రూ.66, తెలంగాణ సోనా/ఆర్ఎన్ఆర్ కిలో రూ.74, జైశ్రీరామ్, హెచ్ఎంటీ రకాల బియ్యం కిలో రూ.79కు మించి విక్రయించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాకుండా మార్కెట్లో ధరల విషయంలో పారదర్శకత ఉండేలా ప్రతి 26 కిలోల బియ్యం బస్తాపై గరిష్ఠ చిల్లర ధరను తప్పనిసరిగా ముద్రించాలని రైస్ మిల్లర్లు, హోల్సేల్, రిటైల్ వ్యాపారులను ఆదేశించింది. అయినప్పటికీ కొందరు వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తూ వినియోగదారులను మోసగిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
2,686 ప్రాంతాల్లో తనిఖీలు.. 370 కేసులు
రాష్ట్రవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్స్ బృందాలు 1,141 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 55 కేసులు నమోదు చేయడంతో పాటు మరో 35 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాయి. మరోవైపు లీగల్ మెట్రాలజీ అధికారులు 1,545 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి 280 కేసులు నమోదు చేశారు.
ఈ తనిఖీల్లో వ్యాపారుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా 25 కిలోల బియ్యం మాత్రమే బస్తాల్లో నింపి, వాటిపై 26 కిలోలుగా ముద్రించిన లేబుళ్లు అంటించి విక్రయిస్తున్న వ్యాపారులను అధికారులు పట్టుకున్నారు. అలాగే అసలు ధర కనిపించకుండా దానిపై అధిక ధరల స్టిక్కర్లు అంటించి వినియోగదారుల నుంచి ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్న ఉదంతాలను గుర్తించారు.
రేషన్ బియ్యం అక్రమ నిల్వలపైనా నిఘా
బియ్యం వ్యాపారాల్లో తూకం, ధరల మోసాలకే పరిమితం కాకుండా పీడీఎస్ రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచుతున్న వ్యవహారాలను కూడా అధికారులు గుర్తించారు. జీఎస్టీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్సులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై కూడా చర్యలకు ఉపక్రమించారు.
తప్పులు పునరావృతమైతే పీడీ యాక్టు
ధరల దోపిడీ, అక్రమ వ్యాపారాల నుంచి వినియోగదారులను రక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. రేషన్ బియ్యాన్ని పదేపదే అక్రమంగా నిల్వ చేసే వారిపై, మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచే వ్యాపారులపై పీడీ యాక్టు ప్రయోగిస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిత్యావసర సరుకుల చట్టం, భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని తెలిపారు.
ఈ తనిఖీలు కేవలం ఒక వారానికే పరిమితం కావని, ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. బియ్యం కొనుగోలు సమయంలో బస్తా బరువు, ముద్రించిన ఎమ్మార్పీని వినియోగదారులు తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.

Post a Comment