యాదగిరిగుట్టలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. శివకేశవుల దర్శనానికి పోటెత్తిన భక్తులు!
యాదగిరిగుట్టలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. శివకేశవుల దర్శనానికి పోటెత్తిన భక్తులు!
యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పర్వదినం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన ప్రాంగణంలోని శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్ఫటిక లింగానికి భక్తులు స్వయంగా అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజల్లో పాల్గొన్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటూ స్వామివారి కృపాకటాక్షాలు పొందారు.
అదేవిధంగా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉభయ దేవాలయాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీపారాధన మండపాల్లో భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం ఎదుట ఉన్న శివాలయంలో అఖండ దీపం సమీపంలో దీపాలు వెలిగించి భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
పవిత్ర కార్తీక పౌర్ణమి రోజున శివకేశవులను దర్శించుకొని, దీపారాధనలు నిర్వహించడంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. యాదగిరిగుట్ట ఆలయ ప్రాంగణం భక్తుల పూజలు, దీపాల వెలుగులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివారి దివ్య ఆశీస్సులు పొందుతూ భక్తులు తమ యాత్రను సఫలీకృతం చేసుకున్నారు.

Post a Comment