పోక్సో కేసులో ప్రముఖ నటుడు శ్రీజిత్ రవికి ఏడాది జైలు శిక్ష.. మలయాళ సినీ పరిశ్రమలో కలకలం!
పోక్సో కేసులో ప్రముఖ నటుడు శ్రీజిత్ రవికి ఏడాది జైలు శిక్ష.. మలయాళ సినీ పరిశ్రమలో కలకలం!
కేరళకు చెందిన ప్రముఖ మలయాళ నటుడు శ్రీజిత్ రవికి పోక్సో కేసులో కోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో మలయాళ సినీ పరిశ్రమలో ఈ తీర్పు చర్చనీయాంశంగా మారింది. ఏడాది జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా కూడా విధిస్తూ త్రిస్సూర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వెలువరించింది.
2022లో నమోదైన పోక్సో కేసు
2022 జూలై 4న కేరళలోని త్రిస్సూర్‌లో ఓ గ్రౌండ్ సమీపంలో పాఠశాల విద్యార్థుల ఎదుట శ్రీజిత్ రవి అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. ఇద్దరు చిన్నారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపిస్తూ పోక్సో చట్టంలోని సెక్షన్ 11(i), ఐపీసీ సెక్షన్ 509 కింద కేసు నమోదు చేశారు.
సీసీటీవీ ఆధారాలతో అరెస్ట్
ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అనంతరం శ్రీజిత్ రవిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా మొత్తం 21 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు నమోదు చేసింది.
మరోవైపు, శ్రీజిత్ రవి బిహేవియరల్ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడుతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. గతంలో ఈ కేసులో కేరళ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
హైకోర్టును ఆశ్రయించనున్న నటుడు
దాదాపు నాలుగేళ్ల విచారణ అనంతరం త్రిస్సూర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించింది. అయితే ఈ తీర్పును కేరళ హైకోర్టులో సవాల్ చేయాలని శ్రీజిత్ రవి నిర్ణయించుకున్నారు. అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ట్రయల్ కోర్టు శిక్ష అమలును ఒక నెలపాటు సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేసింది.
70కి పైగా సినిమాల్లో నటన
శ్రీజిత్ రవి మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందారు. ఇప్పటివరకు 70కి పైగా సినిమాల్లో నటించారు. అలనాటి ప్రముఖ మలయాళ నటుడు టీజీ రవి కుమారుడే శ్రీజిత్ రవి. ప్రముఖ నటుడికి పోక్సో కేసులో శిక్ష విధించడంతో మలయాళ సినీ పరిశ్రమలో ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది.

Post a Comment