రాచకొండ పోలీసుల ఫన్నీ పోస్ట్ వైరల్ అందుకేగా భార్యను అర్ధాంగి అంటారు
రాచకొండ పోలీసుల ఫన్నీ పోస్ట్ వైరల్ అందుకేగా భార్యను అర్ధాంగి అంటారు
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోయాయి. సైబర్ నేరాల కట్టడికి పోలీసులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు.
ప్రజలలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అయితే సైబర్ నేరాల గురించి అర్థమయ్యేలా చెప్పడం కోసం రాచకొండ పోలీసులు ఒక కథను చెప్పి వినూత్న ప్రయోగం చేశారు. హాస్యభరితమైన ఒక కథ ద్వారా సైబర్ నేరాలపైన ప్రజలలో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
*ఫన్నీ స్టోరీ పోస్ట్ చేసిన రాచకొండ పోలీస్*
ఓ సరదా జంట సైబర్ మోసానికి గురికాకుండా ఏ విధంగా బయటపడింది? సైబర్ నేరాలు ఎలా జరిగే అవకాశం ఉంది? సైబర్ నేరాలు జరగకుండా ఉండడానికి మనమేం చేయాలి? వంటి వివరాలను ఆసక్తికరమైన పోస్టు ద్వారా రాచకొండ పోలీసులు తెలియజేశారు ప్రస్తుతం రాచకొండ పోలీసులు పోస్ట్ చేసిన ఈ ఫన్నీ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఆ కథ ఏమిటి అంటే..
*రావు రిటైర్ అయ్యారు కథ*
రావు రిటైర్ అయ్యారు.. పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ అమౌంట్ కూడా వచ్చింది. రావు గారికి వచ్చిన 20 లక్షల రూపాయలను తాను మరియు తన భార్య పేరుతో జాయింట్ అకౌంట్ లో వేశారు. ఇక ఆమెకు ఏటీఎం పిన్ కూడా చెప్పారు. అయితే ఒకసారి పనిమీద గంట సేపు బయటకు వెళ్లాక ఫోన్ మరిచిపోయాను అని గుర్తు వచ్చింది రావు గారికి.. వెంటనే ఇంటికి వచ్చారు.
*బ్యాంక్ నుండి కాల్... ఓటీపీ అడిగారన్న భార్య*
సోఫాలో పడి ఉన్న ఫోన్ చూసి కుదుటపడ్డారు.. సోఫాలో కూర్చుని ఉన్న భార్యను ఫోన్ వచ్చిందా అని అడిగారు. అందుకు రావు గారి భార్య అవునండి బ్యాంకు నుండి ఫోన్ వచ్చింది. జాయింట్ అకౌంట్ సమాచారాన్ని అప్డేట్ చేయమని అంటూ సమాధానం చెప్పింది. దానికి రావు గారికి చెమటలు పట్టి సోఫాలో కూలబడ్డాడు. భయాందోళనతో ఓటీపీ ఇచ్చావా అని అడిగాడు.
*కుప్పకూలిపోయిన రావు*
అందుకు భార్య అవును బ్యాంకు మేనేజర్ స్వయంగా నాకు ఫోన్ చేయగా నేను అతనికి ఓటీపీ ఇచ్చాను అని చెప్పింది. ఇంకేంటి రావు గారు కుప్పకూలిపోయాడు. తల తిరుగుతున్నట్టు అనిపించింది. తన మొబైల్ ఫోన్లో బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేశాడు. అందులో 20 లక్షల రూపాయలు అలాగే ఉన్నాయి. ఏ ఓటిపి ఇచ్చావు అని అడిగారు రావు.
*రావు గారి భార్య అమాయకత్వం సైబర్ నేరం నుండి కాపాడింది*
భార్య అమాయకంగా ఓటీపీ 4042వచ్చిందండి.. జాయింట్ అకౌంట్ కదా నా వంతు ఓటిపి 2021అని చెప్పానంది. రావు గారికి పోయిన ప్రాణం వచ్చినట్టు అనిపించింది. అందుకనే కదా అర్ధాంగి అంటారు అంటూ ఓ సరదా పోస్ట్ పెట్టి మీ బ్యాంకు డీటెయిల్స్, ఓటిపిలు, ఏటీఎంలు, క్రెడిట్ కార్డ్ నెంబర్లు, బ్యాంకు డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయకండి. అలర్ట్ గా ఉండండి. స్మార్ట్ గా వ్యవహరించండి అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు.
*రాచకొండ పోలీసుల వినూత్న ప్రయోగం.. పోస్ట్ వైరల్*
ఈ ఫన్నీ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలాంటి వినూత్న ప్రయోగాల ద్వారా ప్రజలను ఆకట్టుకోవచ్చని ఇలాంటి ఫన్నీ పోస్టులను కచ్చితంగా ప్రతి ఒక్కరు చదువుతారని భావించి సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి ఈ తరహా కొత్త ప్రయోగాలను చేస్తుంది రాచకొండ పోలీసు కమిషనరేట్. ఇక ఇటువంటి పోస్టులు చూసి నవ్వుకోవడమే కాదు సైబర్ నేరాల విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుసుకోవాలి.

Post a Comment