-->

ఫైనాన్స్‌ సిబ్బంది వేధింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం

 

ఫైనాన్స్‌ సిబ్బంది వేధింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం

మధిర : సిబ్బంది వేధింపులు తట్టుకోలేక ఒంటరి మహిళ బలవన్మరణానికి యత్నించిన ఘటన మధిర మండలం రాయపట్నం గ్రామంలో నిన్న చోటుచేసుకుంది. స్థానికులు, బాధితురాలి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుగ్గిళ్లపు వెంకటేశ్వర్లుకు ఒక్కరే కూతురు. పేరు కేతినేని రాజేశ్వరి. ఒంటరి మహిళ అయిన ఆమె తండ్రి వద్దే ఉంటుంది. సొంత ఇల్లు ఉన్న వెంకటేశ్వర్లు ఇతరత్రా అవసరాలకు డబ్బు కోసం ప్రయత్నిస్తూ మధిర పట్టణంలోని ఓ ప్రయివేటు ఫైనాన్స్‌ సిబ్బంది మాటలు నమ్మి 2022, నవంబరులో రూ.5 లక్షల ఇంటి రుణం తీసుకున్నాడు. 

ఇన్సూరెన్స్, ఖర్చులుపోను రూ.4 లక్షలు అతని చేతికి వచ్చాయి. 24 నెలలపాటు క్రమం తప్పకుండా నెల వాయిదా రూ.15,500 చెల్లించాడు. ఈ నేపథ్యంలో గత నెలలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. రుణం ఇచ్చే సమయంలో తండ్రి పేరుతో మంజూరు చేస్తున్నామని చెప్పి రాజేశ్వరి వద్ద ఫైనాన్స్‌ సిబ్బంది సంతకాలు తీసుకున్నారు.

 తీరా వెంకటేశ్వర్లు మృతి చెందిన తర్వాత రుణం రాజేశ్వరి పేరుతోనే ఉందని, మిగిలిన మొత్తం చెల్లించాల్సిందే అంటూ ఆమెను వేధింపులకు గురిచేస్తున్నారు. తన తండ్రికి బ్యాంకు ఖాతా లేకపోవటంతో నెల వాయిదా చెల్లింపులు తన ఖాతా ద్వారా చేసేవారని బాధితురాలు తెలిపింది. న్యాయం చేయాలంటూ ఈనెల 18న ఫైనాన్స్‌ సంస్థ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు, గ్రామస్థులతో కలిసి ధర్నా నిర్వహించింది. అనంతరం పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తాను చనిపోతే రుణం మాఫీఅయి, తన కుమారుడికైనా ఇల్లు మిగులుతుందనే ఉద్దేశంతో మంగళవారం బలవన్మరణానికి సిద్ధపడింది.

 అంతకుముందు సీపీఎం మండల కార్యదర్శి మందా సైదులు చరవాణికి సంక్షిప్త సందేశం పంపింది. తాను చనిపోయాక ఇల్లు తన కుమారుడికి ఇప్పించాలని కోరింది. అప్రమత్తమైన సైదులు, స్థానిక కార్యకర్తను బాధితురాలు ఇంటివద్దకు పంపారు. ఉరికి వేలాడుతున్న రాజేశ్వరిని రక్షించి మధిర సివిల్‌ ఆసుపత్రికి తరలించారు. పట్టణ ఎస్సై సంధ్య బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు..

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793