30 రూపాయల టికెట్ మిస్ అయితే ఉద్యోగాలు తీసేస్తారా? బాధితుల ఆవేదన (వీడియో)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) లో 400 మంది ఉద్యోగులను తొలగించిన నేపథ్యంలో బాధితులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న పొరపాట్లను పెద్ద తప్పులుగా చూపించి తమ జీవితాలను అంధకారంలోకి నెట్టేశారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితుల మీడియా సమావేశంలో ఎండీ సజ్జనార్ తమపై అన్యాయంగా వత్తిడి తెస్తున్నారని, చిన్న తప్పులకే ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తోందని గంభీరంగా వ్యాఖ్యానించారు. “మేము ప్రజల మధ్య సేవలందిస్తున్న ఉద్యోగులు. 30 రూపాయల టికెట్ మిస్ అయితే ఉద్యోగం పోతుందా? సంస్థలో ఉన్న పెద్ద అధికారులు ఎన్నో తప్పులు చేస్తున్నారు, వారికి మాత్రం శిక్షలు లేవా?” అని బాధితులు ప్రశ్నించారు.
"కుటుంబాలు రోడ్డున పడ్డాయి"
ఉద్యోగం కోల్పోయిన వారు కన్నీటి పర్యంతమవుతూ, తాము చేసిన పొరపాటు వల్ల సంస్థకు నష్టం జరిగిందా? బస్సులు కొనడానికి, డిపోలు కొనడానికి మేమేమైనా అవినీతి చేశామా? అని ప్రశ్నించారు. చాలా మంది ఉద్యోగులు తమ కుటుంబాలను పోషించాల్సిన బాధ్యతతో ఉన్నారని, కొందరికి భర్తలు లేరని, కొందరు తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యతలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిని కోరిన బాధితులు
“సజ్జనార్ సార్ మాకు న్యాయం చేయలేకపోతే తన పదవికి రాజీనామా చేయాలి” అని కొందరు ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. తమ సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని, తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
"క్షమాభిక్ష కూడా మనకు వర్తించదా?"
“ఉరిశిక్ష పడిన వారికి కూడా క్షమాభిక్ష ఉంటుంది. అయితే, చిన్న పొరపాటుకు ఉద్యోగం కోల్పోయిన మాకా క్షమాభిక్ష ఉండకూడదా?” అని ఉద్యోగులు వాపోయారు. గత సంవత్సరం నుంచి తమ సమస్య పరిష్కారం కాకుండా ఉండిపోయిందని, పోలీసులను తమ వెంట నిఘా పెడుతున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా హన్మకొండ డిపోకు చెందిన ఓ మహిళా కండక్టర్ తన ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఎదుర్కొంటున్న ఇబ్బందులను చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె పరిస్థితి అందరినీ కలచివేసింది.
"మా ఉద్యోగాలను తిరిగి మాకిస్తారా?"
తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని, తమ ఉద్యోగాలను తిరిగి కల్పించాలని బాధిత ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే మరింత తీవ్రంగా ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

Post a Comment