కన్నబిడ్డలను కాలువలో పడేసిన కసాయి తండ్రి
కోనసీమ జిల్లా, కాకినాడలో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను చంపేసిన ఘటన మరువకముందే, మరో విషాదకరమైన సంఘటన కోనసీమ జిల్లా నెలపర్తిపాడు వద్ద చోటుచేసుకుంది. రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందిన పిల్లి రాజు అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను స్కూటీపై తీసుకువచ్చి గణపతినగర్ లాకుల వద్ద కాలువలోకి నెట్టేసాడు.
ఈ ఘటనలో పదేళ్ల బాలుడు ఈత కొట్టుకుంటూ ప్రాణాలతో బయటపడగా, ఆరేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ దారుణాన్ని జరిపిన పిల్లి రాజు అనంతరం అదృశ్యమయ్యాడు. అతను కూడా కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక పిల్లలను పడేసి అక్కడి నుంచి పారిపోయాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుతం మృత దేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. తండ్రే తన కన్నబిడ్డల ప్రాణాలను బలిచేయడం పట్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగా ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. అయితే, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment