విద్యార్థినిలే లక్ష్యం డ్రగ్స్ ఇచ్చి కామాంధులకు బేరం
వరంగల్: పాఠశాలకు వెళ్లే అమాయక బాలికలను లక్ష్యంగా చేసుకుని ఓ కిలేడీ అరాచకాలకు పాల్పడుతున్న ఘటన వరంగల్‌లో వెలుగుచూసింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు షాకింగ్ వివరాలు బయటపెట్టారు. మత్తుమందులకు బానిసైన ఓ మహిళ గ్యాంగ్ ఏర్పాటు చేసి, చిన్నారులను డ్రగ్స్ మత్తులోకి నెట్టి కామాంధులకు బేరమేసే ఘోరానికి పాల్పడుతున్నట్టుగా వెల్లడైంది.
కిలేడీ గ్యాంగ్ ఆగడాలు
హనుమకొండ జిల్లా దామెర మండలానికి చెందిన ఓ మహిళ వరంగల్ మిల్స్ కాలనీలో నివాసం ఉంటోంది. ఈ మహిళ డ్రగ్స్‌కు బానిసై, తనతోపాటు మరో యువతి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠా ఏర్పాటు చేసుకుంది. ఈజీ మనీ కోసం వారు పాఠశాల బాలికలనే లక్ష్యంగా చేసుకున్నారు. సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహించి, అమాయక బాలికలతో పరిచయం పెంచుకునే పనిలో పడిపోయారు.
ప్రారంభంలో ఆ మహిళ బిడ్డలతో స్నేహం చేస్తూ, తనను మంచిదానిగా నమ్మించేది. పరిచయం పెరిగిన తర్వాత బయటకు వెళదామని చెప్పి, బాలికలను కిడ్నాప్ చేసేది. అనంతరం వారికి డ్రగ్స్ ఇచ్చి, మత్తులోకి నెట్టి, తన గ్యాంగ్ సభ్యుల ద్వారా అమానుషంగా దారుణాలకు గురిచేసేది. బాలికలపై అత్యాచారం జరిపించి, మళ్లీ తన ఆధీనంలోకి తీసుకురావడం ఆమె ముఠా పని విధానంగా మారింది.
పోలీసులను అప్రమత్తం చేసిన ఘటన
ఇటీవల వరంగల్ మిల్స్ కాలనీలో ఓ బాలిక అదృశ్యమైంది. చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రెండు రోజుల తర్వాత బాలిక ఇంటికి తిరిగి రావడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. బాలికను విచారించగా, ఓ మహిళ తనను తీసుకెళ్లిందని, మత్తుమందు ఇచ్చిందని, తర్వాత ఏం జరిగిందో గుర్తులేదని తెలిపింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా, డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ అయింది.
కిలేడీ గ్యాంగ్ కోసం పోలీసులు గాలింపు
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ముఠా కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇలాంటి దురాగతాలు మరో చోట జరుగుతున్నాయా? అనేది పరిశీలనలో ఉంది. తమ పిల్లలను పాఠశాలకు పంపించడమే ముప్పుగా మారిందని తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు.
ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి గ్యాంగ్‌లు మరెక్కడైనా ఉన్నాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇలాంటి నేరస్థులను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ విభాగం అలర్ట్ అయి, డ్రగ్స్ ముఠాలను అణచివేసే చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది.

Post a Comment