ఆధార్, మొబైల్ నంబర్లతో ఓటరు కార్డు లింక్ అవ్వాలి: ఈసీఐ
ఓటర్ ఐడీ కార్డులను ఆయా ఓటర్ల ఆధార్, మొబైల్ నంబర్లతో అనుసంధానం చేయాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు (సీఈఓలు) ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్య ద్వారా ఓటరు డేటాను మరింత శుద్ధి చేయడంతో పాటు నకిలీ ఓటింగ్‌ను నివారించవచ్చని భావిస్తున్నారు.
అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఓటర్ లిస్టును సమయానికి అప్డేట్ చేసేందుకు జనన, మరణాల వివరాలను సమీకరించి వర్తమాన డేటాతో అనుసంధానం చేయాలని కూడా ఈసీ సూచించింది. ఇలా చేయడం వల్ల మృతుల పేర్లు ఓటరు జాబితాలో ఉండకుండా, కొత్తగా అర్హులైన ఓటర్ల వివరాలు చేరేలా ఉంటుంది.
అయితే, ఓటర్ కార్డు ఆధార్‌కు లింక్ చేయడం తప్పనిసరి కాదని 2022లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. కానీ తాజాగా ఈసీఐ ఇచ్చిన ఆదేశాలు ఆ తీర్పుకు భిన్నంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నిర్ణయం ఓటర్ల గోప్యతకు భంగం కలిగించేలా ఉందని, ఇది స్వచ్ఛందంగా ఉండాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఎన్నికల సమయానికి ముందుగా ఓటర్ లిస్టును శుద్ధి చేయడానికి ఇది ఉపయోగపడుతుందని ఈసీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ కొత్త మార్గదర్శకాలకు రాజకీయ పార్టీల ప్రతిస్పందన ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఓటరు కార్డు-ఆధార్ అనుసంధానం వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారనుంది.

Post a Comment