యువతిపై దాడి – అత్యాచార యత్నం: ముగ్గురిపై కేసు నమోదు
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఓ యువతిపై దాడి చేసి శారీరకంగా కలవాలని బెదిరించి గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో ఇద్దరు యువకులు, ఒక మహిళ కలిపి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు హుజూర్ నగర్ ఎస్సై జి. ముత్తయ్య బుధవారం తెలిపారు.
హుజూర్ నగర్ పట్టణానికి చెందిన స్వామి రోజా అనే మహిళ బాధిత యువతి స్నేహితురాలిగా ఉంది. రోజా ద్వారా బాధితురాలు నూక తొట్టి ప్రమోద్ కుమార్ అనే యువకుడిని ఇటీవల పరిచయమైంది. ఈ పరిచయం క్రమంగా సాన్నిహిత్యంగా మారింది.
ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం, ప్రమోద్ కుమార్ బాధిత యువతిని మాట్లాడుదామని ఓ SV లాడ్జి కి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను మభ్యపెట్టి మద్యం తాగించడంతో మత్తులోకి జారుకుంది. ఇదే అవకాశంగా ప్రమోద్ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి, నగ్న ఫోటోలు తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అనంతరం ఈ ఫోటోలు బయటపెడతానని బెదిరిస్తూ, తనతో సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేశాడు.
18వ తేదీన మరో కుట్ర
కొన్ని రోజుల తర్వాత, 18వ తేదీన, బాధిత యువతిని మరోసారి మోసపుచ్చి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. స్వామి రోజా, ప్రమోద్ కుమార్, అతని స్నేహితుడు లచ్చిమల్ల హరీష్ కలిసి యువతిని కారులో ఎక్కించుకుని పట్టణంలోని సబ్-రిజిస్టర్ కార్యాలయ సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు.
అక్కడ స్వామి రోజా, బాధిత యువతిని ప్రమోద్, హరీష్‌లతో శారీరకంగా కలవాలని ఒత్తిడి చేసింది. యువతి నిరాకరించడంతో ముగ్గురు కలిసి ఆమెపై దాడి చేసి గాయపరిచారు.
పోలీసుల చర్య
ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, స్వామి రోజా, నూక తొట్టి ప్రమోద్ కుమార్, లచ్చిమల్ల హరీష్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ముత్తయ్య తెలిపారు.
పోలీసుల ప్రాథమిక విచారణ కొనసాగుతోంది. బాధిత యువతికి వైద్య పరీక్షలు నిర్వహించి, సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Post a Comment